భాగ్యనగరంలో ఎన్నికలు (Elections) ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం.. మరికొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉండటం వల్ల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించడానికి పోలీస్ అధికారులు సిద్దం అవుతున్నారు. మరోవైపు గ్రేటర్ పరిధిలోని పలు చోట్ల ప్రత్యర్థి పార్టీలు తమ అడ్డాలో కాలుపెడితే సహించబోమంటూ.. బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని, కొన్ని నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకునేందుకు నేతలు ఎంతకైనా తెగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులను బైండోవర్ చేసినా.. అనుచరులను రంగంలోకి దింపి కొందరు హల్చల్ చేస్తూ.. బహిరంగ దాడులు చేసుకోవడం పోలీసుల కళ్లెదుటే జరుగుంది. ఈ నేపథ్యంలో సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న చోట పోలీసులు (Police) ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. ముందుగా ఇరువర్గాలను సముదాయిస్తున్నారు. మాట వినని పక్షంలో కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతున్నారు. అభ్యర్థులు, కార్యకర్తలు ఏ పార్టీకి చెందిన వారైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు మలక్‌పేట్, లంగర్‌హౌజ్,చార్మినార్ సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పోలీసు యంత్రాంగం.. అప్రమత్తమైంది. పోలింగ్‌కు ముందుగానే అదనపు బలగాలను రప్పించడానికి సిద్దం అయ్యింది. అదీగాక దక్షిణ, పశ్చిమ, సౌత్ఈస్ట్, సౌత్‌వెస్ట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఈ ప్రాంతాల్లో ఎన్నికల్లో అల్లర్లు చోటు చేసుకునే అవకాశాలు ఉండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఇప్పటికే నగర సీపీ (City CP) సందీప్‌శాండిల్య (Sandeep Sandilya) కీలక ఆదేశాలు ఇచ్చారు. అసాంఘిక శక్తుల (Unsocial forces) విషయంలో కఠినంగా వ్యవహరించమని ఆర్డర్ వేశారు. ప్రజాజీవనానికి ఎలాంటి విఘాతం కలిగించినా సహించేది లేదని సీపీ అన్నారు.. ఇక ప్రస్తుతం సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించిన అధికారులు ఒక్కో నియోజకవర్గానికి 100 మంది వరకి అదనపు బలగాలను రంగంలోకి దింపనున్నట్టు తెలుస్తుంది.