తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల ప్రకటనను చేసినా కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇంకా సస్పెన్స్‌లోనే ఉంచాయి. దీంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే (sherlingampally mla) టికెట్‌పై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. అయితే బీజేపీ ఆ స్థానాన్ని జనసేనకు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో శేరిలింగంపల్లి బీజేపీకే ఉండాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు.
తొలిజాబితాలో బీజేపీ 52మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆ తర్వాత ఒకే ఒక్క అభ్యర్థితో రెండో లిస్టును విడుదల చేసింది. ఇందులో మహబూబ్‌నగర్ అభ్యర్థిగా మిథున్‌రెడ్డిని ప్రకటించారు. ఇక బీజేపీ మూడో లిస్టులో 35మంది పేర్లను ప్రకటించింది. అందులో శేరిలింగంపల్లి టికెట్‌ను మాత్రం బీజేపీ సస్పెన్స్‌లో పెట్టింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇదివరకు పోటీ చేసిన యోగానంద్‌కే పార్టీ టికెట్ వచ్చే అవకాశాలున్నాయని అంతా అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా అక్కడి స్థానాన్ని బీజేపీ వదులుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆంతర్యం ఏమిటో అర్థం కాక పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నారు.
శేరిలింగంపల్లిలో గురువారం రాత్రి యోగానంద్ మద్దతుదారులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లిలో బీజేపీకే టికెట్ కేటాయించాలి.. ప్రత్యేకంగా యోగానంద్‌కే టికెట్ కేటాయించాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సమావేశంలో యోగానంద్ మాట్లాడుతూ.. బీజేపీ తరఫున ఆలస్యం చేయకుండా ప్రచారం మొదలు పెట్టాలన్నారు. బీజేపీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆదేశాలకు తామంతా కట్టుబడి ఉంటామని తెలిపారు. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా వారిని గెలిపించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. అయితే, బీజేపీ అభ్యర్థిని కాకుండా జనసేనకు ఆ ఛాన్స్ ఇస్తే.. గెలుపొందే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఇక్కడి పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన గజ్జల యోగానంద్ అప్పట్లో పార్టీ సంస్థాగతంగా బలంగా లేకపోయినా గట్టి పోటీని ఇచ్చారు. ఓటమిని చవిచూసినా అవేమీ లెక్క చేయకుండా ముందుకెళ్లారు. అయితే బీజేపీ టికెట్‌ను జనసేనకు కేటాయిస్తున్నట్లు వార్తలు రావడంతో పార్టీ శ్రేణులు నిరాశకు గురవుతున్నారు. మరోవైపు, యోగానంద్ను లోక్‌సభకు పంపే యోచనలో ఉన్నట్లు చర్చ నడుస్తోంది. బీజేపీ నాలుగవ లిస్టు వచ్చే వరకూ ఈ వార్తలపై ఓ క్లారిటీ రానుంది.