కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.. వంద రోజుల్లో వ్యవసాయాన్ని అతలాకుతలం చేసిందని ఆరోపించారు. గెలిచినప్పటి నుంచి కేసీఆర్ (KCR) అప్పులు చేశారని డప్పులు కొడుతున్న ప్రభుత్వం.. కేవలం 100 రోజులకే రూ.16,400 కోట్లు అప్పు చేశారని ధ్వజమెత్తారు. అన్ని రంగాలను రేవంత్ (Revanth) సర్కార్ మోసం, వంచన చేస్తున్నారని విమర్శించారు..
నేడు తెలంగాణ (Telangana) భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy).. రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని, త్వరగా రైతులను ఆదుకోవాలని అన్నారు.. నష్టపోయిన వారికి ఎకరాకు రూ.10 వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తమంటే రాజకీయ గేట్లు ఎత్తామంటున్నారని విమర్శించారు.
వడగండ్ల వాన, అకాల వర్షాలతో పంటలు పోయి రైతులు బాధలో ఉంటే ఒక్క మంత్రి కూడా వారికి భరోసా ఇవ్వడం లేదని ఆరోపించారు. గతేడాది ఇదే పరిస్థితి వస్తే స్వయంగా తాను, కేసీఆర్.. వికారాబాద్, వరంగల్ జిల్లాలో పర్యటించి ధైర్యం కల్పించామన్నారు. పరిహారానికి సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలన్నారు. రైతుల మీద ప్రేమ ఉంటే బీఆర్ఎస్ కన్నా ఎక్కువ పరిహారం ఇచ్చి ఆదుకోవాలని నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
మరోవైపు అకాల వర్షాల కారణంగా.. ఆదిలాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని నిరంజన్ రెడ్డి కోరారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు అరచేతిలో స్వర్గం చూపి ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో యువతను మళ్లీ మోసం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉందని ఆరోపించారు..