మరోజన్మెత్తినా అమ్మ రుణం తీర్చుకోలేమేమో..!మనం తన కడుపులో పడ్డ నాడే తన శరీరంలో ఒకభాగం అయిపోతాం. భూమ్మీద పడ్డప్పటి నుంచీ మనం తనకన్నా ముఖ్యం అయిపోతాం.
తన రక్తాన్ని చనుబాలుగా చేసి ప్రాణాన్ని నిలబెడుతుంది.అప్పటి దాకా అద్దం వదలని అమ్మ…పసిపాపగా మనం రావడంతోనే తన అందం, ఆకలి, నిద్ర అన్నీ మరిచిపోతుంది. మన భవిష్యత్తునే తన భవిష్యత్తనుకుంటుంది.జీవితంలో ఎదగాలని కోరుకుంటుంది. బదులుగా అమ్మా అనే పిలుపు కోరుకుంటుంది.
త్యాగానికి మరుపేరైన అమ్మని ..అడ్డుతొలగించుకున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న కన్న తల్లిని..నడిరోడ్డుపై విడిచిపెట్టి వెళ్లిపోయాడు ఓ కఠినాత్ముడు. చేతిలో రొట్టె ముక్క పెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి తిరిగి రాలేదు.
దీంతో నడిరోడ్డుపై వణుకుతు స్పృహ కోల్పోయే దశలో ఉన్న ఆ అవ్వను చూసి చలించిన స్థానికులు..పోలీసుల సహకారంతో ఆసుపత్రికి తరలించారు. విశాఖ జిల్లా ఆనందపురం లో జరిగిన ఈ ఘటన మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలచివేసింది.
మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. కుటుంబ విలువలు దిగజారి పోతున్నాయి. డబ్బు, జల్సాలకు ఇచ్చే ప్రాధాన్యత రక్తాన్ని పంచి జన్మనిచ్చిన వాళ్లకు ఇవ్వడం లేదు. సాటి మనిషే కాదు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా దూరం చేసి కఠినంగా వ్యవహరించే వాళ్లు లేకపోలేదు.
తాజాగా విశాఖ జిల్లా(Visakha District) ఆనందపురం(Anandapuram)లో నడిరోడ్డుపై ఓ తల్లి పడుతున్న వేదన స్థానికులను కంటతడి పెట్టించింది. ఆనందపురం మండలం, వేములవలస(Vemulavasala) పూల మార్కెట్ సమీపంలో… మృదురాలైన ఓ తల్లితో వచ్చాడు వ్యక్తి. అక్కడ తల్లిని వదిలి వెళ్ళిపోయాడు.
మళ్లీ వస్తానని చెప్పి.. చేతిలో రొట్టె పెట్టి అక్కడి నుంచి జారుకున్నాడు. అలా వెళ్ళిన ఆ వ్యక్తి ఎంతకీ తిరిగి రాలేదు. నిమిషాలు గంటలు గడుస్తున్నాయి.. కొడుకు కోసం ఆ తల్లి ఆశగా ఎదురుచూస్తోంది. ఈలోగా తన ఒంట్లో ఉన్న సత్తువ నశించిపోతుంది.
స్పృహ కోల్పోయే స్థితిలోకి వెళ్లిపోయింది. ఇంత బాధలోనూ.. ఎవరిని పిలిచి సహాయం కోరలేదు ఆ వృద్ధురాలు. పూల మార్కెట్(Flower market)వద్ద ఆ వృద్ధురాలు చాలాసేపటి నుంచి ఉన్నచోటనే ఉండటం గమనించిన స్థానికులు.. ఆమె దగ్గరకు వెళ్లి వివరాలు అడిగే ప్రయత్నం చేశారు.
అయితే అంతటి బాధలోనూ తన కుటుంబం వివరాలు వదిలి వెళ్ళిన కొడుకు వివరాలు చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. ఒకవేళ కొడుకును పిలిచి మందలిస్తారేమోనని ఆమె భయం.అంతటి నిస్సహాయతలోనూ ఆమె తన కష్టాన్ని దిగమింగుకుంది.
నీరసించినా ఆమె మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. దీంతో ఆమెకు సత్వరమే సపరియలు అవసరమని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకొని అక్కడకు చేరుకున్న ఎస్సై నరసింహమూర్తి, తన సిబ్బంది.. రోడ్డు పై దీన స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం పోలీసులు, వైద్య సిబ్బంది సహాయంతో కే జి హెచ్(KG H) కు తరలించారు.
పోలీసులు ఆమెను మళ్లీ వివరాలు అడిగే ప్రయత్నం చేశారు. తమది అంబటి వలస గ్రామమని.. తన కొడుకు పేరు రాంబాబు అని మాత్రమే ఆమె చెప్పగలిగింది.వదిలించుకోడానికి ప్రయత్నించే కొడుకు వస్తాడని చెప్పగానే ఆ పిచ్చితల్లి నమ్మేసింది.
ఇప్పటికీ తన కొడుకు అక్కడ ఉండమని చెప్పాడని…తిరిగి వస్తాడని కలవరిస్తున్న తల్లి ఆశని..అమాయకత్వాన్ని చూసి పోలీసుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.అయితే ఆమె వివరాలు ఎవరికైనా తెలిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. నడిరోడ్డుపై ఇలా తల్లిని వదిలేసి వెళ్లిపోయిన కొడుకుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.