దీపావళి పండుగ(Diwali Festival) సందర్భంగా రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. దీపావళి పండుగ నేపథ్యంలో ప్రయాణికులు టపాసులు లేదా మండే స్వభావం ఉన్న వస్తువులను రైల్లో వెంట తీసుకొని రావొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక నియంత్రణ చర్యలను చేపట్టింది. ఇటీవల రైళ్లలో అగ్ని ప్రమాదాలు(Fire Accidents) చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
కొన్నేళ్ల క్రితం తమిళనాడులో పర్యాటక రైలులో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రైల్వే అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదకరమైన వస్తువులను, నిషేధిత వస్తువులను రైల్లో తీసుకెళ్లడం రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 164, 165 ప్రకారం రూ.1000 జరిమానాతో లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష కొన్ని సందర్భాల్లో రెండూ విధిస్తారని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
రైల్లో, రైల్వేస్టేషన్లో టపాసులు తీసుకుని రావడం వల్ల భద్రతకు, ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పునకు దారి తీస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికుల భద్రతకు, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే టపాసులు, పేలే పదార్థాలు, మండే స్వభావం ఉన్న వస్తువులను తీసుకుని రావొద్దని స్పష్టం చేసింది. రైలు లేదా రైల్వే స్టేషన్ లలో ఎవరైనా ప్రమాదకరమైన వస్తువులను తీసుకుని వెళ్లినట్టు గమనిస్తే 1939 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించింది.
ప్రమాదాలను నియంత్రించేందుకు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రత్యేక భద్రతా బృందాలు, క్విక్ రియాక్టన్ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రత్యేక బృందాలు సాధారణ దుస్తులు ధరించి స్నిఫర్ డాగ్స్ సహకారంతో ప్రమాదకరమైన వస్తువులను గుర్తిస్తారని తెలిపింది. ప్రత్యేక నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని ప్రకటించింది. రైలు ప్రయాణికులు కూడా రైల్వే సిబ్బంది, ప్రత్యేక బృందాలకు సహకరించాలని కోరింది.