ఈమధ్యే ఆర్టీసీ (RTC) ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసింది తెలంగాణ (Telangana) ప్రభుత్వం. కార్మికులపై తమకున్న చిత్తశుద్ది ఇదేనని.. ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపించామని బీఆర్ఎస్ (BRS) నేతలు అంటున్నారు. కానీ, ఎప్పుడో డిమాండ్ చేస్తే.. ఎన్నికలకు మూడు నెలల ముందు చేయడం వెనుక కేసీఆర్ (KCR) ఓట్ల రాజకీయం ఉందని చెబుతున్నారు విపక్ష నేతలు. ఇన్నాళ్లూ రాచిరంపాన పెట్టి.. కార్మికుల ఉద్యమాన్ని అవహేళన చేసిన కేసీఆర్ కు ఆర్టీసీని నిజంగా బాగు చేయడం ఇష్టం లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికీ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో తమ రూట్లో బస్సులు కావాలంటూ విద్యార్థులు (Students) రోడ్డెక్కడం చర్చనీయాంశంగా మారింది.
సంగారెడ్డి (Sangareddy) జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై విద్యార్థులు బైఠాయించారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లోని స్టూడెంట్స్ బస్సులు సరిపోక కాలేజీలకు సరైన సమయానికి చేరుకోవడం లేదు. ఈ క్రమంలోనే విద్యార్థులు ధర్నాకు దిగారు. దీనికి ఏబీవీపీ (ABVP), ఎన్ఎస్ యూఐ (NSUI) విద్యార్థి నాయకులు మద్దతు తెలిపారు. విద్యార్థులతో కలిసి బైఠాయించి బస్సుల కోసం ధర్నా నిర్వహించారు. గుమ్మడిదల మండల పరిధిలో బస్సుల్లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
బస్సుల సమస్యపై ఇప్పటికే పలుమార్లు జీడిమెట్ల, నర్సాపూర్ డిపో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారని.. కానీ, పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మండిపడ్డారు విద్యార్థి సంఘాల నాయకులు. పైగా, ఈ రూట్ లో ఉన్న బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని వివరించారు. విద్యార్థులను చూసి కొన్నిచోట్ల బస్సులను ఆపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై వీరు చాలాసేపు బైఠాయించి తమ నిరసనను కొనసాగించారు.
భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో.. మెదక్ డిపో అధికారి సుధా విద్యార్థులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. దీంతో విద్యార్థులు ధర్నాను విరమించారు. అయితే.. రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. కనీసం బస్సు సర్వీసులను కూడా వారికోసం నడిపించలేకపోతోందని మండిపడుతున్నారు విపక్ష నేతలు.