పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవాలని ఆరాటపడుతున్న బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి (Vaddepally Subhash Reddy) షాకిచ్చారు. కమలానికి రాజీనామా చేసి.. హస్తాన్ని అందుకొన్నారు.. మరోవైపు భారీ చేరికలతో పార్టీని బలోపేతం చేసే దిశగా సీఎం రేవంత్ పార్టీ మార్పులను ప్రోత్సాహిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ అంశంపై విమర్శలు సైతం ఎదురవుతున్నాయి..
ఇదిలా ఉండగా గాంధీభవన్లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో సుభాష్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షి కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే సీఎంకి, వడ్డేపల్లికి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉందని అంటున్నారు.. ఇక గతంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి ఎంతో సేవ చేశారని గుర్తు చేసిన రేవంత్.. ఇప్పుడు కూడా ఆయన సేవలు పార్టీకి అవసరమని అభిప్రాయపడ్డారు.
మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి ఎల్లారెడ్డి (Yellareddy) నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డ వడ్డేపల్లి.. అనంతరం బీజేపీ (BJP)లో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి దాదాపు 27000 ఓట్లు సాధించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. లోక్ సమరంలో సైతం విజయాన్ని అందుకోవాలని ఆరాటపడుతోంది.. ఈ క్రమంలో అనుచరుల ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది..