సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు (Supreme Court) తప్పుబట్టింది. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా చేయడం సరికాదని తీవ్రంగా మందలించింది. కొన్నాళ్ల కిందట సనాతన ధర్మం(Sanatana Dharma)పై మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆ ఎఫ్ఐఆర్లు అన్నింటిని కలిపి విచారించాలంటూ ఉదయనిధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
గతేడాది సెప్టెంబరులో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ సనాతన ధర్మంపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’ అని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని అన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది.
దీనిపై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ కింద ఉన్న మీ హక్కులను దుర్వినియోగం చేశారని ఉదయనిధిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, మత స్వేచ్ఛ కింద ఉన్న మీ హక్కులను దుర్వినియోగం చేశారని, ఇప్పుడు మీరే రక్షణ కోసం సుప్రీంకోర్టుకు వచ్చారంటూ ప్రశ్నించింది.
మీ వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియదా? మీరేం సామాన్య పౌరుడు కాదు. ఓ మంత్రి పదవిలో ఉన్నారంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది.