యూపీ (UP)లోని సరైరాశి గ్రామానికి చెందిన సూర్య వంశి ఠాకూర్ వంశస్తులు ఐదువందల ఏండ్ల తర్వాత తలపాగాలు (Turbans) ధరించారు. 500 ఏండ్ల క్రితం అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చిన వేసిన సమయంలో సూర్య వంశి ఠాకూర్ వంశస్తులు తలపాగాలను తీసేశారు. ఆ సమయంలోనే ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశారు.
కూల్చిన చోటనే రామ మందిరాన్ని తిరిగి నిర్మించే వరకు తమ వంశస్తులెవరూ తలపాగా ధరించబోరని శపథం చేశారు. అప్పటి నుంచి ఆ వంశస్తులు తలపాగా ధరించ లేదు. ఆ తర్వాత 2019 లో అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్ కావడంతో సూర్య ఠాకూర్ వంశస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
అప్పటి నుంచి రామ మందిర ప్రారంభోత్సవం కోసం ఆ వంశస్తులు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. 500 ఏండ్లుగా ఎదురు చూస్తున్న శుభ సమయం రానే వచ్చింది. ఈ నెల 22న రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన క్రతువులు పూర్తవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సూర్య వంశి ఠాకూర్ వంశస్తులు తమ తలపాగాలను ధరించారు. ప్రారంభోత్సవాని కన్నా ముందే తలపాగాలు ధరించాలని నిర్ణయించుకున్నట్లు సూర్యవంశి ఠాకూర్లు తెలిపారు. వారు తలపాగాలు ధరించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.