వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే ఏం జరుగుతుందో ఆలోచించి మరీ ఓటెయ్యాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మరో 52 రోజుల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు.
బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఏర్పాటు చేసిన ‘రా కదలిరా’సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ…. ఈ పోరాటం తమ కోసం కాదని వెల్లడించారు. ఈ ఉద్యమం మీ పిల్లల భవిష్యత్ కోసం… ఓటేసే ముందు ప్రతి విషయంపై మనసు పెట్టి ఆలోచించాలని సూచించారు. ఎన్నికలకు ముందే తమ విజయం ఖాయమైందని వ్యాఖ్యానించారు.
అధికార పార్టీని ఓడించి ఇంటికి పంపించడానికి ప్రజలంతా కలిసి వచ్చారని తెలిపారు. జగన్ పని, వైసీపీ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ భూ స్థాపితం కానుందని వెల్లడించారు. ఇక ఎక్కడికక్కడ పరదాలు కట్టుకుని తిరగడం కాదని.. పరుచూరు సమావేశానికి ఎంత మంది ప్రజలు స్వచందంగా వచ్చారో ధైర్యం ఉంటె టీవీ ఆన్ చేసి చూడాలన్నారు.
ధైర్యం చాలకుంటే తమ తమ్ముళ్లు ఇక్కడే ఉన్నారని.. యూట్యూబ్ లింక్ పంపిస్తారని చెప్పారు.. ఒక్కసారి చూస్తే ఇక జగన్‌కు రాత్రులు నిద్ర రాదనీ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు అమరావతే రాజధాని అని జగన్ చెప్పాడా, లేదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అన్నాడా లేదా? అని గుర్తు చేశారు. గెలిచాక ఎందుకు మాట మార్చావ్? అంటూ జగన్ ను నిలదీశారు.
అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అన్నాడు… ఇప్పుడు మళ్లీ హైదరాబాద్‌ను నాలుగో రాజధాని అంటున్నాడని మండిపడ్డారు. బిచ్చమెత్తుకుంటే ఎవరైనా ఆస్తిలో వాటా ఇస్తారా? అని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని చెప్పారు. ‘మేం నష్టపోయాం, మేం చేతకాని వాళ్లం. పనికిరానివాడు సీఎం అయ్యాడు. మేం మళ్లీ వస్తాం… ఓ పక్కన ఉంటాం అంటే ఒప్పుకుంటారా?’అని ప్రశ్నల వర్షం కురిపించారు.
పొయ్యే ప్రభుత్వాన్ని మోస్తే మునిగిపొయ్యేది మీరేనంటూ..జర హుషారుగా ఉండాలని పోలీసులకు చంద్రబాబు సూచించారు. అలానే కాకీ బట్టలు వేసుకున్న పోలీసులు చట్టాన్ని గౌరవిస్తూ మళ్ళీ ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నించాలని కోరారు. తాము మీటింగ్ పెడితే అడ్దుకోవాలని చూసిన జగన్‌కు ప్యాంట్ తడిచిపోయిందన్నారు.