అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో, దురదృష్టం ఎప్పుడు ఒళ్లో పడుతుందో ఎవరికీ తెలీదు.! టీ స్టాల్ నడుపుకునే ఓ సాధారణ వ్యక్తి అనుకోకుండా లక్షాధికారి అయ్యాడు. అంతలోనే ఆ ఆనందం ఆవిరయ్యేలా లక్షణంగా వచ్చిన లక్షలను పోగొట్టుకున్నాడు.
బెంగుళూర్(Bangalore) త్యాగరాజ్ నగర్ కు చెందిన ఓ చాయ్ వాలా( Chai waala) తిలక్ మణికంఠ గోవాకి వెళ్లాడు. ఈనెల ఒకటిన అక్కడ క్యాసినో(Casino)లో ఆడి రూ.10 లక్షల జాక్ పాట్( Jack pot) కొల్లకొట్టాడు. చిన్న చాయ్ బడ్డీ నడిపే త్యాగు ఈ డబ్బుతో పెద్ద హోటల్ మొదలు పెట్టాలని ఆశపడ్డాడు పాపం.!
అయితే మణికంఠకు లక్షలు లక్షలు వచ్చిపడ్డాయని తెలుసుకున్న అతని స్నేహితులకు కన్నుకుట్టుంది. స్నేహితుడికే ధమ్కీ ఇచ్చి అతని దగ్గరున్న డబ్బంతా కాజేసే స్కెచ్ వేసారు. ఆగస్టు 5న మణికంఠను కిడ్నాప్ చేసి 15 లక్షలు కొట్టేసారు.
రోడ్ సైడ్ బేకరీ వద్ద టీ తాగుతున్న మణిని సినీ ఫక్కీలో బలవంతంగా కారులో ఎక్కించుకుని జ్ఞాన భారతి దగ్గర నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లారు. ఓ కొబ్బరి చెట్టుకు అతడిని కట్టేసి బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ చెక్ చేసారు.
అతడి అకౌంట్ లో 25 లక్షలు ఉన్నాయని గుర్తించారు. బెదిరించి, కొట్టి బలవంతంగా అతడిచేత 15లక్షలు ట్రాన్స్ఫర్ చేయించారు. మరునాడు బెంగుళూరు నుంచి బిచాణా ఎత్తేసిన ఆ బ్యాచ్ పోలీసులకు చెబితే అంతుచూస్తామని బెదిరించారు.
అయినా వెనక్కి తగ్గని మణికంఠ పోలీసులను ఆశ్రయించి జరగింది చెప్పడంతో ఆ ఫిర్యాదు ఆధారంగా పొలీసులు నిందితులను పట్టుకుని కేసు నమోదు చేసారు.
పది లక్షలు వచ్చాయని ఆనందపడే లోపు 15 లక్షల నష్టం చూపించి లక్ అతనితో దాగుడుమూతలు ఆడుకుంది. దీంతో కొండనాలుక కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టైంది త్యాగరాజు పరిస్థితి.