కట్టెలమ్మిన చోటే.. పువ్వులమ్మడం.. తిరిగి అదే చోటుకి కట్టెలతో వెళ్ళడం.. అనే సామెత తెలిసిన వారు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ (BRS) పరిస్థితి ఇలా తయారైందేమీటబ్బా అని అనుకొంటున్నారు.. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన షాక్ మరి మామూలుగా లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కారు సీట్లు ఖాళీ అవుతున్నాయి.. పెద్ద బాపు చుట్టూ అన్ని పరేషాన్లు పొదల్లాగా అల్లుకొన్నాయి..
అధికారం ఉన్నన్ని రోజులు, సార్, బాపు అంటూ మాట్లాడిన వారంతా ఒంటరిని చేసి వెళ్ళడం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో బీఆర్ఎస్ కీలక నేత గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లుగా తాజా పరిణామాలు తెలియచేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఖరారు కోసం నిర్వహించిన సమావేశానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalasani Srinivas Yadav)తో పాటు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరు అవకపోవడం చర్చాంశనీయంగా మారింది.
అలాగే కొద్ది రోజులుగా తలసాని వ్యవహారం తేడాగా ఉందని తెలుస్తోంది.. కేసీఆర్ (KCR) పుట్టిన రోజు వేడుకల్ని.. తెలంగాణ బాపు కేసీఆర్ అంటూ ఓ రేంజ్ లో నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత ఒక్క సారిగా కామ్ గా మారారు.. అయితే సికింద్రాబాద్ నుంచి తన కుమారుడికి సీటు కోసం హడావుడి చేసినా.. తర్వాత మాట మార్చారు.. చివరికి ఆయనకే ఆఫర్ ఇచ్చినా నిర్మోహమాటంగా నో చెప్పేశారు.
ఇక చేసేది ఏం లేక చివరికి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును కేసీఆర్ ఖరారు చేశారని తెలిసిందే.. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నియోజకవర్గంలో తలసాని తిరగడం లేదు. పట్టించుకోవడం లేదని టాక్ మొదలైంది. కాగా కొద్ది రోజులుగా ఆయన బీజేపీ హైకమాండ్ తో టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఆయన వ్యవహారం గులాబీ కండువా తీసేలా కనిపిస్తుందనే చర్చ మొదలు అయ్యేలా ఉందంటున్నారు..