ప్రజా సమస్యలు, వరదలపై అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వరద సాయంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో వరదలు వస్తే సాయం చేయడు.. బురద రాజకీయం మాత్రం పక్కా చేస్తడు అని విమర్శించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్ఆర్డీపీ పనుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
సమావేశాలు 30 రోజులు జరపాలని బీజేపీ నాయకుడు ఉత్తరం రాశారని.. కాంగ్రెసోళ్లేమో 20 రోజులు జరపాలని డిమాండ్ చేశారన్నారు కేటీఆర్. కానీ, ప్రశ్నోత్తరాల సమయంలో తామందరం ఉన్నాం.. కాంగ్రెస్, బీజేపీల నుంచి ఒకరి చొప్పున మాత్రమే ఉన్నారని మండిపడ్డారు. దీన్ని బట్టి వీరికి ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని సెటైర్లు వేశారు. బయటేమో డైలాగులు.. 20 రోజులు కావాలి.. 30 రోజులు కావాలి అని.. కానీ 30 నిమిషాలు కూర్చొనే ఓపిక లేదు అంటూ మండిపడ్డారు.
వరదల నష్ట పరిహారం ప్రకటించాలని కాంగ్రెస్ నేతల డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిహారం ప్రకటించలేదని నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. ఇసుక మేటల విషయంలో ప్రణాళిక రూపొందించాలని శ్రీధర్ బాబు అన్నారు. ఫసల్ బీమా పథకం రాష్ట్రంలో అమలుకావడం లేదని.. ఇది అమలుకాక రైతులు నష్టపోతున్నారని వివరించారు. ఇక 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ నేతలు ఎప్పుడైనా రైతుబీమా ఇచ్చారా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
మరోవైపు, వరద బాధితుల సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ సంఘాలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించాయి. వరద బాధితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. బాధితులకు రూ.50 లక్షల పరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇళ్లు కోల్పోయిన వారికి 20 లక్షలు ప్రకటించాలని నిరసన తెలిపారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.