లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) దూకుడు పెంచాయి.. కానీ బీఆర్ఎస్ (BRS)లో మాత్రం ఎలాంటి హడావుడి కనిపించడం లేదనే టాక్ రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. అసలు తెలంగాణ (Telangana)లో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటనే చర్చలు సైతం మొదలైనట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ పార్టీగా పది సంవత్సరాలు ఎదురులేకుండా ముందుకు సాగిన కారు పరిస్థితి ప్రస్తుతం ఆగమ్యగోచరంగా మారడంపై విభిన్న స్వరాలు వినిపిస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన క్షణం నుంచీ బీఆర్ఎస్ కు వరుసగా షాక్ ల మీద షాక్ లు తగలడం కనిపిస్తోంది. కారు దిగి.. హస్తం చేయిపట్టుకొనే నేతల సంఖ్య పెరుగుతోంది. ఇలా వలసల జోరు చూస్తుంటే.. బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయిందా అనే సందేహాలు రాష్ట్రంలో మొదలైయ్యాయి. అయితే ఈ విషయంలో కేసీఆర్ (KCR) మౌనం వహించడం వెనుక అర్థాలు వెతుకుతున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి తలుపులు బార్లా తెరిచి మరీ స్వాగతం పలికిన రోజులు గుర్తు చేసుకొంటున్నారు. ఇలాంటి సమయంలో వలసలపై గళం విప్పితే ఆ బాణాలు తిరిగి తనకే తాకుతాయనే ఆలోచనతోనే బీఆర్ఎస్ బిగ్ బాస్ మౌనంగా ఉన్నారని అంటున్నారు.. అసెంబ్లీలో పోయిన పరువును లోక్ సభ ఎన్నికలలో సాధించుకుందామనే భావనతో పార్టీనీ, క్యాడర్ ను సమాయత్తం చేద్దామంటే అందుకూ పరిస్థితులు సానుకూలంగా కనిపించడం లేదని.. ఎలాగో అధికారంలో ఉన్న పార్టీనే చక్రం తిప్పుతుందని భావిస్తున్నారని అంటున్నారు.
అందులో నేతలు కూడా ప్రస్తుతం పార్టీ కంటే పదవులు ముఖ్యం అనే విధంగా ప్రవర్తిస్తుండటంతో.. రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ నియోజకవర్గాలకూ అభ్యర్థులను ఎంపిక చేయడమే కష్టంగా మారిన పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు.. మరోవైపు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని కనుసైగతో కంట్రోల్ చేసిన కేసీఆర్ ప్రస్తుతం ఇంత డీలా పడిపోవడం చూసిన విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే లోక్ సభలో బీఆర్ఎస్ గట్టెక్కే పరిస్థితులు లేవని భావిస్తున్న అధిష్టానం.. కనీసం బీజేపీతో అయినా దోస్తీ కడదామని భావిస్తుండగా.. టీ బీజేపీ నేతలు ఇందుకు నై అనడం.. పెద్దసారుకు మింగుడు పడని అంశంగా మారిందంటున్నారు. అదీగాక ఇప్పటి వరకు ప్రజల ముందుకు రాష్ట్ర సెంటిమెంట్ తో వెళ్ళి.. ప్రజలకు తోచిన హమిలిచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి అంటూ ప్రచారం చేసి కోలుకోలేని దెబ్బతీయడం నుంచి ఇంకా నేతలు కొలుకున్నట్లు కనిపించడం లేదంటున్నారు..
అందుకే ఏం చెప్పి ప్రజలను ఓట్లడగాలన్న విషయంలో స్పష్టత లేని అయోమయ స్థితిలో బీఆర్ఎస్ ఉంటే.. అధికార కాంగ్రెస్ కొలువుదీరిన ఈ మూడు నెలలలో అమలు చేసిన వాగ్దానాలను విస్తృతంగా ప్రచారం చేసుకోవడంతో పాటు, అధికారంలో ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతు ముందుకు సాగడం కనిపిస్తోంది.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తానున్న రోజుల్లో ఉద్యమ పార్టీ కాస్త.. సాధారణ పార్టీగా మారే అవకాశాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..