తెలంగాణ (Telangana)లో నీళ్ళ వివాదం నిప్పులు కక్కుతోంది. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్య అసెంబ్లీ సాక్షిగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో కాసేపటి క్రితం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కీలక నోట్‌ను రిలీజ్ చేసింది. కేసీఆర్ తప్పిదాలు.. లోప భూయిష్ట విధానాలు పేరుతో.. కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు వివరిస్తూ, ప్రభుత్వం నోట్ విడుదల చేసింది.
కృష్ణా బేసిన్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో కేసీఆర్ (KCR) ప్రభుత్వం విఫలమైందని నోట్లో కాంగ్రెస్ పేర్కొంది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సర్కారు వెల్లడించింది. కేసీఆర్ పాపాలు.. తెలంగాణకు శాపంగా మారాయని.. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తి లేదని తెలిపింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా రాబట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొంది.
మరోవైపు నీటిపారుదల రంగంపై శాసనసభలో సోమవారం శ్వేతపత్రం (White Paper On Irrigation Projects) విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై (Budget) నేడు చర్చలు జరగనుండగా.. దీంతోపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన లోపాలపై సభలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తొమ్మిదిన్నరేళ్లలో విధ్వంసమై తెలంగాణ జలదృశ్యాన్ని జనం ముందు ఉంచడానికి సిద్ధమైన ప్రజా ప్రభుత్వం. తమపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్ కు ధీటుగా సమాధానం ఇవ్వడానికి సిద్దం అయ్యింది. కృష్ణా జలాల వినియోగంలో, వాటాలో, హక్కుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై సాగునీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
గడచిన పదేండ్లలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా వివరించారు మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు ఈ నెల 13న ప్రభుత్వం కార్యక్రమం ఖరారు చేసి ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించినప్పటికీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు తిరస్కరించిన విషయం తెలిసిందే.