తెలంగాణ (Telangana)లో అప్పుడే భానుడి ప్రతాపం మొదలైంది. రాత్రి సమయంలో వాతావరణం కాస్త చల్లబడుతున్న.. పగలు మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు ఒంటి పూట బడులు (Half Day Schools) నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. కాగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని తెలిపింది.. అలాగే పదో తరగతి పరీక్షలు జరిగే కొన్ని పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం క్లాసులు జరిపేందుకు పర్మిషన్లు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు మార్చి నెల ప్రారంభానికి ముందే రాష్ట్రంలో ఎండలు సెగలు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం సీఎం (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) సచివాలయంలో అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రత మార్పుల తీవ్రత దృష్ట్యా ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.