ఎన్నో సవాళ్ళ మధ్య తెలంగాణ (Telangana) సీఎం (CM)గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి (Revanth Reddy).. తన పాలనకు ఢోకా లేకుండా.. ప్రజల్లో కాంగ్రెస్ పై ఉన్న నమ్మకం కోల్పోకుండా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకొంటూ ముందుకువెళ్తున్న సీఎం.. తాజాగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసిన కాంగ్రెస్ సర్కారు.. ఆర్థిక శాఖను ఉద్యోగాల ఖాళీలు వెంటనే రెడీ చేయాలని ఆదేశించారు.
మరోవైపు రేవంత్ ఆదేశాల మేరకు.. ఆర్థిక శాఖ ఖాళీలపై అప్రూవల్ ఇస్తే, టీఎస్సీఎస్సీ జాబ్ నోటిఫికేషన్ల ప్రకియ ఫిబ్రవరి నుంచే ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది.. ఇందులో భాగంగా త్వరలోనే టీఎస్పీఎస్సీపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.. ఇక యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏడాది ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టేలా కొత్త బోర్డు, ప్రభుత్వం, ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోనున్నట్లు తెలిసింది.
అదీగాక లోక్ సభ ఎన్నికల కోడ్ అమలైతే ప్రజల్లో ప్రభుత్వం పట్ల నెగెటివ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉండటంతో.. కోడ్ అమలు కాకముందే.. జాబ్ క్యాలెండర్ హామీపై కసరత్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు గత బీఆర్ఎస్ (BRS) సర్కారు తొమ్మిదేళ్లలో ఒక్క డీఎస్సీ ప్రకటన వేయలేదు.. అయితే గతేడాది నవంబర్లో 5వేల టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేయగా ఎన్నికల కారణంగా వీటికి బ్రేక్ పడింది.
ఈ నేపథ్యంలో 5వేల ఉద్యోగాలకు మరో 7 వేల ఉద్యోగాలు కలిపి మొత్తం 12వేల టీచర్ల ఉద్యోగాలకు మెగా డీఎస్సీ వేయాలని రేవంత్ రెడ్డి ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కాగా ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డితో పాటు సభ్యులు సైతం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో నిరుద్యోగులను సైతం ఆకర్షించడానికి చేసే ప్రయత్నాల్లో వేగం పెంచుతున్నారని తెలుస్తోంది.