కేసీఆర్ (KCR) ప్రభుత్వ పదేళ్ల పాలనా కాలంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ IAS అధికారి స్మితా సబర్వాల్. ఈ మధ్యకాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడ్డాక స్మితా సబర్వాల్‌కు, రేవంత్ (Revanth) సర్కార్ ఎలాంటి బాధ్యతలు అప్పచెబుతోందనే చర్చ జోరుగా సాగింది. వీటికి చెక్ పెడుతూ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది.
ఈ మేరకు కొత్త బాధ్యతలు స్వీకరించిన స్మితా సబర్వాల్ (Smita Sabharwal) గురువారం ఆఫీస్‌లో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ శాఖలో పని చేస్తున్న సర్పంచ్‌లు ఏవైనా సమస్యలు ఉంటే.. లేదా సూచనల కోసం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యాలయానికి వచ్చి తనను సంప్రదించగలరని ట్వీట్ చేశారు.
తనను కాలవాలనుకొనే వారు అపాయింట్ మెంట్ కోసం కార్యాలయం నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. ఆఫీస్ గూగుల్ మ్యాప్‌ను సైతం షేర్ చేసిన స్మితా సబర్వాల్.. ఎర్రమంజిల్‌లో చిన్న కార్యాలయం ఉందని పేర్కొనడం హాట్ టాపిక్‌గా మారింది.. ఎందుకంటే గతంలో ఆమె పర్యవేక్షిస్తున్న శాఖలో ఉన్న సమస్యలు చెప్పుకుందామంటే కనీసం అపాయింట్ మెంట్ కూడా దొరికేది కాదు..
అలాంటి స్మితా సబర్వాల్ తాజా బదిలీ తర్వాత, తన అపాయింట్‌మెంట్ కోసం ఏకంగా ఫోన్ నెంబర్‌తో పాటు కార్యాలయం అడ్రస్, ఆఫీస్ లొకేషన్ షేర్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. దీంతో మేడంలో ఈ మార్పు ఏంటి అని చాలా మంది చర్చించుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ చాలా కాలం పాటు సీఎంవో కార్యదర్శిగా, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.. ఆ సమయంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులు పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఫీల్డ్ విజిట్‌కు ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారి తీసింది.