రాజకీయం ఎప్పుడైతే ఊసరవెల్లిలా రంగులు మార్చడం మొదలు పెట్టిందో.. అప్పుడే ప్రజాసేవ పేరు కాస్త.. స్వార్థ సేవగా మారిందని అంటున్నారు.. ప్రస్తుత పరిస్థితుల్లో దోచుకో, దాచుకో అనే తీరుగా రాజకీయాలు సాగుతున్నాయనే ఆరోపణలున్నాయి.. ఈ పార్టీ ఇంత దోచుకోంది అని చెప్పడం కంటే.. యావత్ రాష్ట్ర ప్రజలకు తెలిసిందే.. ఎవరు దోచుకుని ఆర్థికంగా బలిసిపోయారో అని లోలోపల అనుకుంటున్నారు..
ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పాలన గురించి చర్చలు ఆగడం లేదు.. ఇందుకు కారణాలున్నాయని అంటున్నారు.. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక సమన్వయంతో పాలనకు సహకరించ వలసింది పోయి.. ఎప్పుడెప్పుడు ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వద్దామా అనే కుట్రలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. అధికారం లేకుంటే.. బ్రతుకు అంధకారమే అనే తీరుగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నట్టు విమర్శలు రోజు రోజుకు ఎక్కువగా వినిపిస్తున్నాయి..
అయితే ఆనతి కాలంలో కాంగ్రెస్ లో ఉప్పెనలా మారి సీఎం పీఠాన్ని దక్కించుకొన్న రేవంత్ వ్యూహాలు సైతం తక్కువగా అంచనా వేయడానికి లేదంటున్నారు.. అదీగాక బీఆర్ఎస్ నేతల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్న రేవంత్ రెడ్డి (Revanth Reddy).. గులాబీ పై పగతీర్చుకోవడం కంటే.. రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచే ప్రయత్నంలో ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. కానీ తమ ఎమ్మెల్యేలతో ఫిరాయింపులపై చర్చలు ప్రారంభిస్తే మాత్రం…సీన్ మారిపోతుందని హెచ్చరించినట్టు తెలుస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాక ముందు నుంచే బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున బెదిరింపులకు దిగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు మాత్రమే ఉంటుందని ఆరోపణలు చేయడం.. తెర వెనుక ఏమైనా జరుగుతున్నాయన్నట్లుగా వారి మాటలు ఉన్నాయనే చర్చలు రాజకీయాల్లో మొదలైయ్యాయి..
ఇలాంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్నదానిపై రేవంత్ రెడ్డి క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పది స్థానాలు గెలిస్తే.. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు ఎవరూ చేయలేరని భావిస్తున్నట్టు సమాచారం.. కానీ బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ప్రయత్నాలు చేస్తున్నాయని, తమ వ్యూహాలు తమకు ఉన్నాయంటున్నారు హస్తం నేతలు..