Telugu News » Telangana : కారు-సారూ.. పదహారు.. ఇప్పుడు లేదు ఏ జోరు.. బీఆర్ఎస్ సైలంట్ వెనుక ఉన్న రహస్యం ఇదేనా..?

Telangana : కారు-సారూ.. పదహారు.. ఇప్పుడు లేదు ఏ జోరు.. బీఆర్ఎస్ సైలంట్ వెనుక ఉన్న రహస్యం ఇదేనా..?

టికెట్ ఇస్తామని ఆఫర్ చేస్తున్నా కనీసం పట్టించుకొనే వారే కరువయ్యారు.. ఒకవేళ బ్రతిమిలాడి ఇచ్చినా అలా తీసుకొని ఇలా వెనక్కి ఇచ్చేస్తున్న అవమానకర పరిస్థితి ఎదురవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి..

by Venu

తెలంగాణ సెంటిమెంటుతో అధికారం పొందిన బీఆర్ఎస్.. మరుక్షణమే ప్రజల ఆకాంక్షలను ఆటకెక్కించి.. స్వీయ వర్గ ఆధిపత్య ప్రయోజనాలను అమలుచేసిందనే ఆరోపణలున్నాయి. అదీగాక తానొక్కడినే చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చినా అని బుకాయించడమే కాకుండా కొడుకు, కూతురు, అల్లుడితో తెగ ప్రచారం చేయించుకోవడం. నిజమైన ఉద్యమకారుల త్యాగాలను విస్మరించిడం వంటి చేష్టలతో ఫక్తు రాజకీయ నాయకుడిగా కేసీఆర్ గుర్తింపు పొందారనేలా మారిపోయారని అనుకొనేలా చేశారు..

Why is BRS so angry with jumping leaders..are they really their own?మరోవైపు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన టీడీపీ నాయకులకు రెడ్​ కార్పెట్ పరిచి ఆహ్వానించి కీలక మంత్రి పదవులు ఇచ్చారు.. ఈ క్రమంలో నిజమైన ఉద్యమకారులను, మేధావులను దూరం చేసుకొన్నారు.. అయితే అతి కొద్దిమంది అవకాశవాదులైన మేధావులు తమ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ కు జై కొట్టారు. సొంత రాజ్యాన్ని స్థాపించి కుటుంబ సభ్యులను పాలనలో భాగస్వాములుగా చేసి గత దొరల పాలనను గుర్తు చేశారని చర్చించుకొనేలా చేశారు..

మొత్తానికి తెలంగాణ సామ్రాజ్యానికి కల్వకుంట్ల కుటుంబం తప్ప వేరే దిక్కులేదనేలా.. కొడుకు.. మనవడు ఇలా రాజకీయాల్లో తన వంశం పారంపర్యంగా కొనసాగుతుందని భావించిన పెద్ద సారుకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఊహించని జలాక్కు ఇచ్చారు.. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ కలలో కూడా ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటుందని తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నపుడు కారు టికెట్ కు హిట్టు సినిమాకు ఉన్నంత గిరాకీ ఉండేది.

కానీ ఇప్పుడు టికెట్ ఇస్తామని ఆఫర్ చేస్తున్నా కనీసం పట్టించుకొనే వారే కరువయ్యారు.. ఒకవేళ బ్రతిమిలాడి ఇచ్చినా అలా తీసుకొని ఇలా వెనక్కి ఇచ్చేస్తున్న అవమానకర పరిస్థితి ఎదురవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. అదేవిధంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కారు-సారూ.. పదహారు అనే నినాదంతో తెగ హాల్ చల్ చేసిన బీఆర్ఎస్ ప్రస్తుతం సైలంట్ గా సాగడం ఆసక్తికరంగా మారిందని అనుకొంటున్నారు..

ఇక రాజకీయ ఎదుగుదల కోసం టీఆర్ఎస్ (TRS)ను కాస్త బీఆర్ఎస్ (BRS)గా మార్చిన బాస్ తెలంగాణ (Telangana) ఆత్మగౌరవానికి విలువ ఇవ్వలేదనేలా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి.. ఈ క్రమంలో తెలంగాణ బలం, దళం, గళం అనే నినాదంతో ఇప్పుడు ముందుకు వెళ్ళితే.. ఇంకా ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు భావించి కామ్ గా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది..

మరోవైపు జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) సరైన నినాదం, విధానంతో ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళడం కనిపిస్తోంది. కానీ బీఆర్ఎస్ కే ఓ నినాదం, విధానం లేకుండా పోవడం మైనస్ గా మారిందనే టాక్ వినిపిస్తోంది.. అందులో ప్రస్తుత పరిస్థితుల్లో కారుకు ఓటేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని జాతీయ పార్టీలు తెగ ప్రచారం చేస్తున్నాయి.. ఇలా ప్రస్తుతం బీఆర్ఎస్ బలాలు, బలహీనతలను బేరీజు వేసుకొంటే.. ఒకటి, రెండు చోట్ల కూడా గెలుపు అందని ఆకాశంగా మారిందనే వాదన వినిపిస్తోంది..

You may also like

Leave a Comment