ప్రస్తుతం తెలంగాణ (Telangana) రాజకీయాలు ప్రజల కోసం కాకుండా.. పర్సనల్ రీవెంజ్ కోసం అన్నట్లుగా సాగుతున్నాయనే చర్చలు ప్రారంభం అయ్యాయి. గత ప్రభుత్వంలో ప్రజలకు ఒకరకమైన అనుభవం కలిగితే.. ప్రస్తుత ప్రభుత్వంలో మరో కొత్త కోణం కనిపిస్తుందని అనుకొంటున్నారు. ప్రజల సంక్షేమం కోసం కాకుండా తప్పులు తవ్వుకుంటూ.. జనానికి విసుగుపుట్టె విమర్శలు చేస్తూ నడుస్తున్న రాజకీయాలు.. అధికారం కోసం.. పదవుల కోసం మాత్రమే అనేలా ఉన్నాయనే విమర్శలు మొదలైయ్యాయి..
కొన్ని సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై బీఆర్ఎస్ (BRS) నేతల విమర్శలు పలు అనుమానాలకు చోటిస్తుండగా.. వారి తీరు అధికారం లేకుండా బ్రతలేము అనేలా ఉందని అంటున్నారు.. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం గట్టిగా వార్నింగ్ ఇస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అందులో ఇతర విషయాల్లో ఎలా ఉన్నా తన ప్రభుత్వ మనుగడ గురించిన వ్యాఖ్యలు మాట్లాడే సమయంలో ఆయన పూర్తిగా కంట్రోల్ తప్పుతున్నారని అనుకొంటున్నారు.
తాజాగా మహబూబ్ నగర్ (Mahbub Nagar)లో జరిగిన ప్రజాదీవెన సభలో రేవంత్ రెడ్డి మాటలు చాలా వరకూ నాటుగా ఉండటం రాజకీయ వర్గాలలో చర్చాంశనీయంగా మారింది. ప్రభుత్వం జోలికి వస్తే మానవ బాంబులం అవుతామని.. పేగులు మెడలో వేసుకుని తిరుగుతామని సీఎం హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. ఇతర విషయాల్లో చాలా పద్దతిగా కౌంటర్ ఇస్తున్నారు. కానీ ప్రభుత్వంపై కుట్రల విషయం వచ్చే సరికి మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు..
మరోవైపు లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కష్టాలల్లో పడిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ (BJP) నేతలు బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లేందుకు కేసీఆర్, కేటీఆర్ (KTR) ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. అందులో చీకట్లో ఉన్న ఇన్ఫార్మర్లు ఎప్పటికప్పుడు గులాబీ బాస్ కు ముఖ్య సమాచారం అందిస్తూ.. ప్రభుత్వం పడిపోయేలా చేస్తున్నారనే అనుమానాలున్నాయి.. ఇలాంటి కొన్ని కుట్రపూరితమైన అంశాల స్పష్టత రావడంతోనే రేవంత్ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారన్న అభిప్రాయం కాంగ్రెస్ లో విపిస్తున్నాయి.
అదేవిధంగా సందుల్లోనో.. గొందుల్లోనో ఎవర్నైనా గోకితే ఊరుకునేది లేదని హెచ్చరించడం వెనుక.. ప్రభుత్వ పతనానికి ప్లానింగ్ గట్టిగానే చేస్తున్నారనే లోతైన అర్థం ఉందన్న అంచనాలకు వస్తున్నారు. మరోవైపు గత పదేళ్లుగా బీఆర్ఎస్ చేసిన అనేక తప్పుల్ని రేవంత్ రెడ్డి సర్కార్ వెలుగులోకి తెస్తోందనే భయంతో.. ఇలాంటూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారనే భావనలో కాంగ్రెస్ నేతలున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి చీకటి సామ్రాజ్యం కంపిస్తోందన్న ఆలోచనలతో.. రేవంత్ సర్కార్ ఉండకూడదన్న ఉద్దేశంతోనే గట్టిగా ప్రయత్నిస్తున్నారని.. అది తెలిసే రేవంత్ తన బాష తీరు మార్చుకొని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. ఇక ఈ వార్నింగ్ కేవలం విపక్షాలకే కాదని.. అలాంటి ప్రయత్నాలు చేసే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అని కొందరు అన్వయించుకొంటున్నారు..