కవిత తన సొంత ఇమేజ్ కంటే కేసీఆర్ కూతురుగా పాపులారిటీ సంపాదించుకొందని అంటారు.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తండ్రి చాటు బిడ్డగా పదవి దక్కించుకొన్నారు. వడ్డించే వారు మనవారైతే నల్లి బొక్కలకు కొదువేముంది అనే తీరుగా ఇంటి పార్టీలో ఆమె ఆడింది ఆట.. పాడింది పాటలా సాగిందనే విమర్శలు పుట్టాయి.. ఇక తెలంగాణ (Telangana)లో అసలు ఆడపడచులు లేనటట్లు.. కవిత మాత్రమే తెలంగాణ ఆడపడచు అనే స్టాంప్ ముద్రించుకొని చేసిన ఘనకార్యాలపై ఎన్నో ఆరోపణలున్నాయి..
ఇదేసమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ పునాదులను కదిలించింది. ఇది కొనసాగుతుండగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అధికారం కోల్పోగానే అనారోగ్యం బారిన పడటం పార్టీకి ఊహించని మైనస్ గా మారింది. ఇలా వరుసపెట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలతో పాటు ఒక్కొ నిర్ణయాలపై రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ చేయడం గులాబీ బాస్ కు మింగుడుపడటం లేదని అంటున్నారు.
ఈ క్రమంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నుంచి గట్టి పోటీ తప్పదనే ప్రచారం మొదలైంది.. ఇలా బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బలు ఎదురవుతున్న తరుణంలో అనూహ్యంగా కవిత (kavtha)కు ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ (Liqure Scam) కేసులో సీబీఐ నోటీసులు ఇవ్వడం.. ఈ నెల 26న తమ ఎదుట విచారణకు హజరు కావాలంటూ పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది.
అదీగాక కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరగనున్నది. తాజా పరిమాణాల నేపథ్యంలో ఎప్పుడేం జరగబోతున్నదనే ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు కవితకు అరెస్ట్ తప్పదా అనే చర్చ తెరమీదకు వస్తోంది. ఇక గతంలో కవితను ఈడీ మూడు సార్లు ప్రశ్నించగా.. ఒక సారి సీబీఐ విచారించింది. తాజా నోటీసులు ఎలాంటి ట్విస్ట్ కు దారి తీస్తోందనే చర్చ మొదలైంది.
ఇక మునిగిపోతున్న పార్టీని కాపాడాలనే ధ్యాసలో ఉన్న గులాబీ బాస్.. కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొనే అంశంపై మల్లగుల్లాలుపడుతుండగా.. కవిత ఇష్యూ మరోసారి తెరపైకి రావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కు చిక్కులు తప్పవా అనే చర్చ జోరందుకోంది. ఇప్పటికే ఈ కేసు వల్ల పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.