కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ (BRS) నేతలు తెగ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో విషయాన్ని సీరియస్ గా తీసుకొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. వడ్ల కొనుగోలులో రైతులను ఇబ్బందిపెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.. అన్నదాతల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయని సృష్టం చేశారు..

ఇలాంటి వారి విషయంలో కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులకు సూచించారు.. అదేవిధంగా వడ్లను నేరుగా కల్లాల నుంచి మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఒకట్రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి రేటు పొందాలని అన్నదాతలకు తెలిపారు. ఇక మార్కెట్ యార్డుల్లోనే ధాన్యం ఆరబెట్టేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలన్న సీఎం ఆదేశించారు..
వడ్ల దొంగతనం జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు.. అలాగే అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని.. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని రేవంత్ పేర్కొన్నారు..
అలాగే వడగళ్ల వానలు వచ్చినా ఇబ్బందిలేకుండా అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ విషయాల పట్ల ఎవరైనా తప్పుడు ఫిర్యాదులిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు..