తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ (LRS) దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో పెండింగ్ దరఖాస్తులన్నీ క్లియర్ కానున్నాయి. గత సర్కారు లే అవుట్ల క్రమబద్ధీకరణకు 2020 ఆగస్టులో జీవో 131ను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25.44 దరఖాస్తులను వచ్చాయి. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో దరఖాస్తులన్నీ క్లియర్ కావడమే కాకుండా రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని సర్కారు భావిస్తోంది.
ఈ క్రమంలో మార్చి 31లోపు లేఔట్లు క్రమబద్ధీకరణ చేసుకునేందుకు వీలు కల్పించింది. దాంతో 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.. కానీ దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను, చెరువు శిఖం భూములను తప్ప ఇతర లే-అవుట్ (Lay-out)లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకొంది. ఇదిలా ఉండగా గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు స్వీకరించింది.
ఆ సమయంలో రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల (Corporations) నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్లు సమర్పించారు. ఓపెన్ ప్లాట్లు, నాన్ లే అవుట్ కు సంబంధించిన దరఖాస్తుదారులు వెయ్యి రూపాయల ఫీజు చెల్లించి, తమ డాక్యుమెంట్ కాపీని సమర్పించారు. పెద్ద లే అవుట్ స్థలాలకు సంబంధించి రూ.10 వేలు దరఖాస్తు ఫీజుగా చెల్లించారు. కానీ తర్వాత ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
ఇలా నాలుగు సంవత్సరాలుగా ఈ పక్రియ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో వీటికి మోక్షం లభించింది. తాజాగా ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో నిర్మాణ అనుమతులకు ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయి. మరోవైపు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ లేని ప్లాట్లు, వాటి యజమానులు పడుతున్న ఇబ్బందులపై గతంలో కొందరు కాంగ్రెస్ (Congress) నేతలకు వినతులు అందాయని, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నదని టాక్ వినిపిస్తోంది.