రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) అధికారం కోల్పోయాక పార్టీ అవినీతిపై పలు ఆరోపణలు ప్రచారంలోకి వస్తున్నాయి.. ఇప్పటికే కాళేశ్వరంపై చర్చలు గరం గరంగా సాగుతోన్న విషయం తెలిసిందే. అదీగాక మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ (Srinivas Yadav) ఆఫీసులో ఫైళ్ళు మాయం.. ప్రగతిభవన్ నుంచి కంప్యూటర్లు మాయం.. నీటి పారుదల శాఖలోని ఫైళ్లు కూడా మాయం. ఇలా ఇదివరకు ప్రభుత్వాలు మారినప్పుడు జరగని చోరీలు ప్రస్తుతం జరగడం చర్చాంశనీయంగా మారింది.
అయితే తాజాగా ధరణి (Dharani)లో పెద్దస్థాయిలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన పత్రాలు మాయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వందల ఎకరాల్లో క్లియరెన్స్ ఇచ్చిన కేసుల్లో, కరస్పాండెన్స్ కాగితాలు లేకుండా కుట్ర చేస్తున్నట్లు సమాచారం. అక్రమాలు బయటపడకుండా, తాము ఇరుక్కోకుండా ఆఫీసర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతోన్నట్లు చర్చించుకొంటున్నారు..
ఈ స్కామ్ లో కింది స్థాయి సిబ్బంది, ధరణి ఆపరేటర్ల పై నెపం పెట్టి తప్పించుకోవాలని, అక్రమాలకు పాల్పడిన వారు చూస్తున్నట్టు రెవెన్యూ శాఖలో చర్చ నడుస్తోంది. మరోవైపు ధరణి అక్రమాల్లో కొందరు ఐఏఎస్ (IAS) అధికారుల పాత్రపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అందులో కొందరు ప్రస్తుతం కీలక స్థానాల్లో ఉన్నారు. వారు గత ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల విలువైన సర్కారీ భూములను సరైన ఆర్డర్లు లేకపోయినా, దొడ్డిదారిన ప్రైవేటు వ్యక్తులకు, కంపెనీలకు కట్టబెట్టారనే విమర్శలు ఉన్నాయి.
అయితే భూ అక్రమాలపై కాంగ్రెస్ (Congress) సర్కారు ఫోకస్ చేసిందన్న చర్చ నడుస్తున్న సమయంలో.. గత ప్రభుత్వ అక్రమాల్లో పాలుపంచుకొన్నట్టు ఆరోపణలు ఉన్న కొందరు అధికారులు.. అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆధారాలు లేకుండా చేయడం ద్వారా.. తాము సేఫ్ గా ఉంటారనే భావనతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు టాక్..
మరోవైపు అక్రమాల నిరూపణ కావాలంటే ఆధారాలు అదృశ్యం కాకుండా చూడాలి. ఆ ఫైళ్లు మాయమైతే ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకొనేందుకు అవకాశాలు ఉండవు. ధరణి సమస్యలపై కమిటీ వేసిన నేపథ్యంలో.. జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చడానికి కలెక్టర్లు, తహసీల్దార్ల సంతకాలతో కూడిన కాపీలను తెప్పించుకోవాలని రెవెన్యూ అధికారులు భావిస్తోన్న సమయంలో ఈ చోరీలు కలకలం సృష్టిస్తోన్నాయి..