నిరుద్యోగుల ఆశలను గత ప్రభుత్వం నీరుగార్చిందన్న ఆపవాదు ఉన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో అధికారంలో కొలువుదీరిన కాంగ్రెస్ పై ఎన్నో ఆశలు పెట్టుకొన్నారు నిరుద్యోగులు. అయినా ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ ప్రభుత్వం నుంచి రాకపోవడంతో.. రాష్ట్రంలో గ్రూప్-2 (Group-2) రాత పరీక్షలపై సందిగ్ధం నెలకొంది. వచ్చేనెల 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను (Examinations) రీషెడ్యూల్ చేస్తారా? యథావిధిగా కొనసాగుతాయా? అనే అనుమానాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి..
రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నియామకాలు చేపడతామనే హామీ ఆటకెక్కినట్టేనా? గత ప్రభుత్వంలా ఇప్పుడు సైతం ఎదురు చూపులు తప్పవా? అని నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు.. గతేడాది గ్రూప్-2లో 783 పోస్టులతో ఉద్యోగ ప్రకటన జారీ చేసింది టీఎస్పీఎస్సీ. తొలుత ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని అనుకొన్నా.. అభ్యర్థుల కోరిక మేరకు నవంబరు 2, 3 తేదీలకు పరీక్షను రీషెడ్యూల్ చేశారు.
అయితే రాష్ట్రంలో నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు రీషెడ్యూల్ కాగా, మూడోసారి ఈ పరీక్షల నిర్వహణపై ఇంతవరకు టీఎస్పీఎస్సీ (TSPSC) కమిషన్ నుంచి ఎలాంటి జవాబు లేదు.. మరోవైపు టీఎస్పీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో పరీక్షలు నిర్ణయించే అధికారం కమిషన్‌కే ఉంటుందని, ఇటీవల ప్రభుత్వం వెల్లడించింది.
గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ సభ్యులు పేపరు లీకేజీ చేశారని ఆరోపణలు ఒకవైపు.. టీఎస్పీఎస్సీలో గందరగోళ పరిస్థితి నెలకొందనే వార్తలు మరోవైపు అభ్యర్థులకి అగ్నిపరీక్షల మారాయి.. ఇదే సమయంలో ఛైర్మన్ సహా ముగ్గురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయడం.. కమిషన్ బోర్డు లేకపోవడంతో పరీక్షలపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేకుండా పోయింది.
మరోవైపు ఛైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు. రాజీనామా పత్రాలు గవర్నర్ కార్యాలయానికి పంపిన వారెవరూ కమిషన్‌కు రావడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీఎస్పీఎస్సీకి నూతన బోర్డు ఏర్పాటు అవసరం ఏర్పడింది. ఈ సమయంలో ప్రభుత్వం కొత్తబోర్డును ఏర్పాటు చేస్తే, కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లకు కార్యాచరణ మొదలు కానుందని తెలుస్తోంది. అప్పటి వరకి ఎదురు చూపులు తప్పవని అర్థం అవుతోంది..