తెలంగాణ (Telangana) బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మ్యాటర్ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటం.. అందులో బీఆర్ఎస్ (BRS) నేతలు సైతం అవినీతి నిరూపించాలని సవాల్ విసిరిన నేపథ్యంలో.. ఈ నెల 13వ తేదీన ఎమ్మెల్యేలను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకువెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్య సూత్ర దారి అయిన కేసీఆర్ (KCR)ను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ బాధ్యతను ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించినట్లు తెలిసింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ సమావేశాలు ఈనెల 13వ తేదీ వరకు జరగాల్సి ఉండగా ఒక రోజు ముందు 12వ తేదీనే ముగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
అయితే మేడిగడ్డ సందర్శనకు సమావేశాలు ముగిసిన మరుసటి రోజే తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు కృష్ణా జలాల అంశంపై నల్గొండ జిల్లాలో 13వ తేదీన కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇదే రోజు ప్రభుత్వం కాళేశ్వరం సందర్శనకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలనే ఆలోచనతో పాటు ఈ సందర్శనకు కేసీఆర్ ను సైతం ఆహ్వానించాలనే ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ తారాస్థాయికి చేరుకుంటోంది. బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ను రౌండప్ చేసే ప్రయత్నం చేస్తుంటే, కృష్ణాజలాల విషయంలో బీఆర్ఎస్ అధికార పక్షాన్ని కార్నర్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అదీగాక కాళేశ్వరం పాపం అంతా కేసీఆర్ దేనని పదే పదే నొక్కి చెబుతున్న రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ వేదికగా కృష్ణాజలాల్లో తెలంగాణకు అన్యాయం జరగడానికి కేసీఆర్ కారణం అని ఆరోపించారు.
మరోవైపు అనూహ్యంగా అధికార పక్షం కాళేశ్వరం సందర్శన ప్లానింగ్ వెనుక రేవంత్ వ్యూహం ఉందని అనుకొంటున్నారు. కానీ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల విషయంలో ఇప్పటి వరకు స్పందించని కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వం ఆహ్వానిస్తే సందర్శనకు వెళ్తారా లేదా అనేది పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీస్తోంది.