రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని అంటారు.. ప్రజారంజకంగా పాలన ఉంటే.. ఆ ప్రభుత్వం ఎంతకాలం అయినా అధికారంలో ఉంటోందన్న విషయం అందరికి తెలిసిందే.. అయితే ప్రజాశ్రేయస్సు కోరే వారికి పెద్దగా పబ్లిసిటీ అవసరం లేదు.. ప్రజలే వారు చేసిన మంచి పనులని చాటుతారు. అదేం మాయనో తెలియదు కానీ అధికారంలోకి రాకముందు మనవారిగా కనిపించిన నాయకులు.. పదవిలోకి రాగానే పరాయివారిగా చూస్తూ.. ధనార్జనే ధ్యేయంగా బ్రతకడం నేటి రాజకీయాల్లో ఎక్కువైందని అంటున్నారు..
ఇక దాదాపుగా పది సంవత్సరాల నుంచి కేసీఆర్ (KCR) అనే పేరు రాష్ట్రంలో సైరన్ లా మోగింది. కానీ కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో మాజీ సీఎం కేసీఆర్ పేరిట ఉన్న స్కీమ్‌ల పేర్లను మార్చేందుకు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.. ఇప్పటి వరకి హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో కేసీఆర్ కిట్ (KCR Kit)..కేసీఆర్ న్యూట్రిషనల్ కిట్ ( KCR Nutritional Kit) పేరిట రెండు స్కీమ్‌లు ఉన్నాయి.
అయితే కేసీఆర్ కిట్ ప్రభుత్వ దవాఖాన్లలో డెలివరీ చేయించుకున్న మహిళలకు ఇస్తున్నారు. ఇదే స్కీమ్ కింద ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లాడైతే రూ.12 వేలను దశలవారీగా తల్లి అకౌంట్‌లో వేస్తారు. రెండేండ్లుగా కిట్‌లు మాత్రమే ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వడం ఆపేశారు. మరోవైపు కేసీఆర్ న్యూట్రిషనల్ కిట్ స్కీమ్ కింద గర్భిణులకు పోషకాహార పదార్థాలను అందజేస్తున్నారు.
కాగా ప్రస్తుతం ఈ రెండు స్కీమ్‌లను కొనసాగించే యోచనలో ఉన్న కాంగ్రెస్ సర్కార్, వాటి పేర్లను మాత్రం మార్చే ఆలోచన చేస్తున్నదని తెలుస్తోంది. ఈమేరకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా (Damodara Rajanarsimha) అధికారులతో చర్చించినట్టు సమాచారం. కొత్తగా ఏం పేర్లు పెట్టాలనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని.. ఈ విషయంపై త్వరలో ఒక నిర్ణయానికి వచ్చి వాటి పేర్లని ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తోన్నాయి..