తెలంగాణ వైద్యారోగ్యశాఖ(Department of Health) కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ఎంపీ వైద్యులకు(Registered Medical Practitioner) కొత్త నిబంధనలు(New Rules) జారీ చేసింది. ఇకపై ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మధ్యకాలంలో గల్లీకో వైద్యుడు ఉంటున్నాడు. అందులో ఎక్కువగా ఆర్ఎంపీలు దర్శనమిస్తుంటారు. అయితే, వీరికి కొన్ని ట్రీట్మెంట్స్ చేయడానికి మాత్రమే మెడికల్ కౌన్సిల్ ద్వారా అనుమతి ఉంటుంది.
కానీ, కొందరు ఏకంగా ఆపరేషన్స్ చేసే వరకు వెళ్లిపోయారు. హైదరాబాద్ మహానగరంలో జనాభా సుమారు 1కోటికి పైగా ఉంటుంది.ఇక్కడ సామాన్య మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా జీవనం సాగిస్తుంటారు. పొట్టకూటికోసం నగరానికి వచ్చి ఏదో ఒక పనిచేసుకుంటూ బతకీడుస్తున్నారు.ఇటువంటి ప్రజలకు ఆరోగ్యం బాలేకపోతే మొదట సంప్రదించేది స్థానికంగా ఉండే ఆర్ఎంపీ వైద్యులనే.
ఈ మధ్య కొందరు వైద్యులు తమ అర్హతకు మించి వైద్యం చేసేందుకు యత్నిస్తుండగా అవి రోగుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల ఆర్ఎంపీలపై ఫిర్యాదులు పెరిగిపోవడంతో వైద్యారోగ్య శాఖ రంగలోకి దిగింది. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్-2010 ప్రకారం.. ఆర్ఎంపీలు తమ పేరు ముందు డాక్టర్ అనే పేరును తీసేయాలని ఆదేశించింది. రోగ నిర్దారణ చేసి మందులు ఇవ్వడం, ఇంజెక్షన్లు వేయడం, సెలైన్ ఎక్కించడం, అబార్షన్లు చేయడం, కాన్పులు చేయడం ప్రిస్కిప్షన్ రాయడం వంటివి చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు పాస్ చేసింది.
ప్రజలకు తెలిపే సూచిక బోర్డులపై ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే పెట్టుకోవాలి, వారికి అర్థం కాని విధంగా డాక్టర్, ఆర్ఎంపీ అని రాయరాదని పేర్కొంది.కాగా,ఈ మధ్యకాలంలో కొందరు ఆర్ఎంపీలు అబార్షన్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందగా..వైద్యారోగ్యశాఖ ఆర్ఎంపీలపై ఆగ్రహం వ్యక్తంచేసింది.