భక్తి అనేది ఒక నమ్మకం.. ఈ నమ్మకం ఎంతవరకు అయినా తీసుకెళ్తుందని పెద్దలు అంటారు. అందుకే సమాజంలో ఉన్న ఎన్నో ప్రార్థన మందిరాలు.. ఆలయాలు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఇసుకపోస్తే రాలనంత జనంతో నిండిపోతాయి. అయితే మనుషులకు అన్ని తెలిసి ఆశతోనో.. కోరికతోనో దైవాన్ని దర్శిస్తారని అనుకుంటే.. మాటలు రాని.. మనిషిలా ఆలోచించలేని మూగ జీవాలు సైతం భక్తిని ప్రదర్శించడం కొన్ని కొన్ని సందర్భాలలో కనిపిస్తోంది.
ప్రస్తుతం అయోధ్య (Ayodhya) రామమందిరం (Ram Mandir)లో చోటు చేసుకొన్న ఇలాంటి సంఘటన ఆసక్తికరంగా మారింది. నిన్న సాయంత్రం ఆలయం గర్భగుడిలోకి ఓ వానరం (Monkey) ప్రవేశించింది. దీంతో ఆశ్చర్యపోయిన భద్రతా సిబ్బంది.. వెంటనే తేరుకొని రామయ్య ఉత్సవ విగ్రహాన్ని నేలపై తోసేస్తుందన్న భయంతో అప్రమత్తమయ్యారు. పరుగెత్తుకెళ్లి కోతిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఆ కోతి ఆలయ ఉత్తర ద్వారం వైపు వెళ్లింది. అక్కడి గేటు మూసి ఉండడంతో, తూర్పు ద్వారం గుండా వేలాది భక్తులను దాటుకొని వెళ్లిపోయింది. అయితే ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా ఆ వానరం బయటకు వెళ్ళడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే రామ్లల్లాను చూసేందుకు హనుమంతుడే గర్భగుడిలోకి ప్రవేశించాడని భద్రతా సిబ్బంది వ్యాఖ్యానించినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేర్కొంది.
వానరం ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించిన విషయాన్ని ఎక్స్ (X) వేదికగా తెలిపింది. మరోవైపు అయోధ్య రామాలయ గర్భగుడిలోకి వానరం ప్రవేశించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం వివిధ కామెంట్లు పెడుతున్నారు. రామయ్య చూసేందుకు హనుమంతుడు వచ్చాడని పోస్ట్లు చేస్తున్నారు. భక్తి మనసులో కలిగితే భగవంతుడే రప్పించుకొంటాడని అంటున్నారు..