రాష్ట్రంలో జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై.. మాజీ స్పీకర్, బాన్సువాడ (Bansuwada) ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలకు స్వస్తి పలకాలని పేర్కొన్నారు.. ఆదివారం తెలంగాణ (Telangana) భవన్లో నిర్వహించిన, నిజామాబాద్ (Nizamabad) పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన.. బీఆర్ఎస్ ని ప్రక్షాళన చేయవలసిన సమయం ఏర్పడిందని తెలిపారు..
నేతలు అహంకార ధోరణి వీడి ప్రజల మధ్యకు వెళ్లాలని సూచించారు.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో గెలవలేదన్న పోచారం.. మన బలహీనతలే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం అయ్యాయని బాంబ్ పేల్చారు. బీఆర్ఎస్ లో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారిని గుర్తించి దూరం పెట్టకపోవడం వల్ల నష్టం జరిగిందని ఆరోపించారు..
బీఆర్ఎస్ ఓటమిలో కార్యకర్తల తప్పు లేదని అన్నారు.. పార్టీ ఓటమికి నాయకులుగా మనమే బాధ్యత వహించాలని సూచించారు. సంఖ్యా పరంగా కాంగ్రెస్ గెలువొచ్చు, కానీ నైతికంగా బీఆర్ఎస్ గెలిచిందని పోచారం పేర్కొన్నారు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ కున్న కేడర్, మరే పార్టీకి లేదని, కష్టపడి పనిచేస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో, బీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు రావడం కష్టం కాదని అభిప్రాయపడ్డారు.