స్వతంత్య్ర అనంతరం సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీ దేశంలోని పుణ్యక్షేత్రాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయిందని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. ఒక దేశం దాని సాంస్కృతిక మూలాలను కాపాడుకోకుండా ఎప్పటికీ అభివృద్ధి చెందదని అన్నారు. మన తీర్థయాత్రలు, మన దేవాలయాలు (Temples), మన ప్రార్థనా స్థలాలు ఇవి కేవలం సందర్శించవలసిన ప్రదేశాలు మాత్రమే కాదన్నారు. ఇవి మన నాగరికత వేల సంవత్సరాల ప్రయాణానికి చెరగని చిహ్నాలని వెల్లడించారు.
అసోంలో మొత్తం రూ.11,600 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం గౌహతి ఖానాపరాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ…. ఈ ప్రాజెక్టులన్నీ అసోం, మిగిలిన ఈశాన్య ప్రాంతాలను ఆగ్నేయాసియా దేశాలతో కనెక్టివిటీని పెంచుతాయని తెలిపారు. అవి పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయన్నారు.
అసోంలో బీజేపీ ప్రభుత్వం రాక ముందు కేవలం ఆరు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని చెప్పారు. కానీ నేడు ఇప్పుడు ఆ సంఖ్య 12కు చేరుకుందన్నారు. అస్సాం నేడు ఈశాన్య ప్రాంతంలో క్యాన్సర్ చికిత్సకు ప్రధాన కేంద్రంగా మారుతోందని చెప్పారు. స్వాతంత్య్రానంతరం అధికారంలో ఉన్నవారు ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయారని మండిపడ్డారు. రాజకీయ కారణాలతో తమ సొంత సంస్కృతిని చూసి సిగ్గుపడే ధోరణిని తీసుకు వచ్చారని ఫైర్ అయ్యారు.
దేశంలో గృహాల విద్యుత్ బిల్లును జీరోకు తీసుకు వచ్చే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకుల సంఖ్య పెరుగుతోందన్నారు. గతంలో సౌకర్యాలు సరిగా లేకపోవడంతో ఈశాన్యాన రాష్ట్రాలకు పర్యాటకులు వచ్చేవారు కాదని చెప్పారు. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆ పరిస్థితిని మార్చివేసిందని వెల్లడించారు.
గత పదేళ్లలో అభివృద్ధి వ్యయాన్ని నాలుగు రెట్లు పెంచామన్నారు. 2014 తర్వాత 1,900 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్‌లు, పదేళ్లలో 6,000 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులు నిర్మించామని వివరించారు. ‘మోదీ హామీ’ ఎప్పటికీ వృథా కాదన్నారు. “వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ ద్వారా దేశంలోని 200 మిలియన్ల మంది ప్రజలు లబ్ది పొందారని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడి జీవితాన్ని సంతోషమయం చేయాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కోసం రూ. 1.11 లక్షల కోట్లు వెచ్చించాలని నిర్ణయించామన్నారు.