ఆంధ్రప్రదేశ్(AP)లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏస్థాయిలో ఉందో తెలియాలంటే తెలంగాణ అసెంబ్లీ చర్చ వింటే తెలుస్తుందని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramchandra Reddy) అన్నారు. రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈనెల 18న రాప్తాడులో రాయలసీమ జిల్లాల ‘సిద్దం’ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు భారీగా పార్టీ క్యాడర్, నాయకులు హాజరవుతారని చెప్పారు.
ఏపీ రైతులకు జరిగిన మేలు తెలంగాణ అసెంబ్లీలో మంత్రులే చెబుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎంత నీరు నిలబెట్టారో, సీఎం వైఎస్ జగన్ దానికి రెట్టింపు నిలబెట్టారని చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రజలకు ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితి లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. టీడీపీ పతనావస్థకు చేరిందని ఇది ప్రారంభం మాత్రమేనని దుయ్యబట్టారు.
టీడీపీ నమోదు చేసిన దొంగ ఓట్ల వల్ల గతంలో తాము కొన్ని సీట్లు ఓడిపోయామన్నారు. తాము ఎలాంటి ఓటర్ నమోదులు చేయలేదని తెలిపారు. అధికారులను బ్లాక్ మెయిల్ చేసే లక్షణం చంద్రబాబుదని ఆరోపించారు. సిద్ధం సభ ఎన్నికలకు ఇది శంఖారావం అని, ఇప్పటికే భీమిలి, ఏలూరులో సభ విజయవంతంగా నిర్వహించామన్నారు.
ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. షర్మిల టీడీపీ అజెండాలో భాగంగా పని చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. అందరూ ఏకమవుతారని మొదటి నుంచి చెప్తున్నామని గుర్తుచేశారు. జగన్ ఎప్పుడూ సింగిల్ గానే వస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.