సీఎం జగన్(CM Jagan)పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్(Srinivas)కు ఏపీ హైకోర్టు(AP High Court) బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అతడు పలుమార్లు తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించిన ఫలితం లేకుండాపోయింది. అనూహ్యంగా అతడికి ఏపీ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
ప్రతీ ఆదివారం కోర్టులో ముమ్మిడివరం పీఎస్‌లో హాజరు కావాలని, రూ.25వేల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని సూచించింది. అదేవిధంగా ఈ కేసు విషయమై మీడియాతో మాట్లాడొద్దని కోర్టు ఆదేశించింది. కొద్ది రోజుల కిందట నిందితుడు శ్రీనివాస్ ఈ కేసులో తనకు అనుకూలంగా సీఎం జగన్ వచ్చి సాక్ష్యం చెప్పాలని, లేదంటే తాను జైల్లోనే ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఢిల్లీలో కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. గురువారం ఢిల్లీ ఏపీ భవన్లో అంబేడ్కర్ విగ్రహం ముందు కోడి కత్తి శ్రీను తల్లి, అన్న సుబ్బరాజు, టీడీపీ మైనార్టీ హక్కుల నాయకులు ధర్నా చేపట్టారు. జగన్ కోర్టుకు రావాలని.. సాక్ష్యం చెప్పాలంటూ నినాదాలు చేశారు. కోడికత్తి కేసులో అసలు నిందితులు ఎవరో జగన్ నోరు విప్పాలని శ్రీను కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఏపీలో దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులు ఆపాలని నినాదాలు చేశారు. 2018, అక్టోబర్ 25లో వైజాగ్ ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌పై కోడికత్తితో దాడి జరిగింది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడంపై దళిత, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.