రాష్ట్రంలో చలితీవ్రత తగ్గుతోంది. వాతావరణం ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ(Telangana) వైపు అల్పపీడన గాలులు వీస్తుండడమే ఇందుకు కారణమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HMD) అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం కనిపిస్తుందని అధికారులు తెలిపారు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 20 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని, ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కి.మీ వేగంతో ఆగ్నేయ దిశగా వీస్తాయని పేర్కొన్నారు. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత20.2 డిగ్రీలు. గాలి తేమ 84 శాతంగా నమోదైంది.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పై చలి పంజా విసురుతుంది. సింగిల్ డిజిట్‌కు కనిష్ట ఉష్ణోగ్రతలు పడ్డాయి. కొమురం భీం జిల్లాలోని సిర్పూర్ యూ లో 8.7డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదిలాబాద్ జిల్లాలోని అర్లీటీలో 8.9కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా నిర్మల్ జిల్లాలోని పెంబిలో 10డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా నిల్వాయిలో 11.4ఉష్ణోగ్రతలు నమోదైంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో జోన్లో ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు కురుస్తుందని చెబుతున్నారు. ఉత్తర కోస్తా ఆంధ్రలోనూ పొడి వాతావరణం ఉంటుంది. రాయలసీమలో కూడా పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.