ఏపీ సీఎం జగన్(AP CM Jagan) దొంగ ఓట్లతో మరోసారి గెలవాలని కుట్రలు చేస్తోందని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి(BJP AP Chief Purandeswari) ఆరోపించారు. బీజేపీ సోషల్ మీడియా విభాగంతో బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి ఇవాళ(బుధవారం) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణపై పురంధేశ్వరి దిశానిర్దేశం చేశారు.
దొంగ ఓట్లతో గెలవాలని జగన్ కుట్రలు చేస్తున్నారని, ఓటర్ల జాబితాలో వైసీపీ అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. అదేవిధంగా వలంటీర్ వ్యవస్థను ఎన్నికలకు పూర్తిగా దూరం పెట్టాలని కోరామన్నారు. మోడీ చేసిన మంచి, జగన్ చేసిన మోసాలు ప్రజలకు వివరించాలని సోషల్ మీడియా విభాగానికి సూచించారు. ఎన్నికలకు గ్రామ, మండల స్థాయిలో కమిటీలు వేసుకోవాలన్నారు.
పల్లెనిద్ర కార్యక్రమాలు చేపట్టి అక్కడి ప్రజలకు బీజేపీ చేసిన మంచిని వివరించాలని సూచించారు. వైసీపీ నేతలు ఎపిక్ కార్డులు కూడా మార్ఫింగ్ చేసి దొంగ ఓట్లు సృష్టించారని, దొంగ ఓట్ల ఆధారంగానే జగన్ సర్కార్ ‘‘వైనాట్ 175’’ స్లోగన్ ఇచ్చిందని పురంధేశ్వరి ఆరోపించారు. దొంగ ఓట్ల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి సస్పెన్షన్ బీజేపీ విజయమని చెప్పుకొచ్చారు.
ఓటు మార్చుకునే అవకాశాన్ని కూడా వైసీపీ నేతలు దుర్వినియోగం చేశారనిఉపాధి హామీ పథకం కింద ఇచ్చే డబ్బు కేంద్రానిదేనని పురంధేశ్వరి తెలిపారు. అభివృద్ధి కోసం కేంద్రమిచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులను జగన్ ప్రభుత్వం తగ్గించడమే పనిగా పెట్టుకుందన్నారు. కేంద్రం ఇచ్చే బియ్యాన్ని జగన్ వాహనాల్లో పంపిణీ చేస్తూ తమ బియ్యంగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.