రాష్ట్రాన్ని సైకో చేతిలో పెడితే ఐదేండ్లలో ఐదు కోట్ల మంది బాధితులు అయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) మండిపడ్డారు. టీడీపీ (TDP) ప్రభుత్వ హయాంలో తాము ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు వైఎస్ జగన్ (YS Jagan) గంజాయి ఇస్తున్నాడంటూ నిప్పులు చెరిగారు. తాను సైకోకు భయపడనని చెప్పారు. సైకో పోవాలి సైకిల్ రావాలని అన్నారు.
కనిగిరి నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ…. జగన్ ప్రభుత్వంలో వీరబాదుడు ఉందన్నారు. దేశంలోనే పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు ఏపీలో ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. జగన్ దోపిడీ వల్ల కరెంట్ బిల్లులు పెరిగాయన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించాలని తాము ప్రయత్నించామని వెల్లడించారు. కానీ చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం జగన్ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని జగన్ 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడని ఫైర్ అయ్యారు. పులివెందుల నుంచి వచ్చి చీమకుర్తి గ్రానైట్ దోచుకుంటున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కనిగిరి ప్రాంత ప్రజలు పేదరికంలో ఉన్నా, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి స్థిరపడుతున్నారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనిగిరి రూపురేఖలను పూర్తిగా మారుస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇచ్చామన్నారు. కానీ జగన్ ట్రాక్టర్ ఇసుకకు రూ. 5000 వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. నాసిరకం మద్యం అమ్మి జగన్ పేదల రక్తాన్ని తాగుతున్నాడంటూ విరుచుకు పడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాణ్యమైన మద్యం నాణ్యమైన ధరకి ఇస్తామని స్పష్టం చేశారు.
అభివృద్ధి, సంక్షేమం టీడీపీ నినాదమని వెల్లడించారు. దేశంలో మొదటి సారి రెండు రూపాయలకే ఎన్టీఆర్ బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజలకి 10 రూపాయలు ఇచ్చి 100 దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు ఇవ్వడం తెలియదన్నారు. జాతీయ స్థాయిలో జరిగిన సర్వేలో నిరుద్యోగంలో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు.