విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రధాని మోడీ (PM Modi) ఆయన మిత్రులకు అమ్మేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ( Manickam Tagore)అన్నారు. మోడీ సర్కార్ పాలనలో ఏపీకి అన్యాయం జరిగిందని తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ, టీడీపీ, జనసేనలు ప్రశ్నించలేవని వెల్లడించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని కేవలం కాంగ్రెస్ మాత్రమే ప్రశ్నించగలదన్నారు.
అమరావతిలో మీడియా సమావేశంలో మాణిక్క ఠాగూర్ మాట్లాడుతూ…. మోడీ పాలనలో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. ప్రధాని మోడీతో సీఎం జగన్ తెర వెనుక ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. తొమ్మిదిన్నరేళ్లు గడిచినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని తెలిపారు. బీజేపీకి జనసేన మిత్రపక్షమని గుర్తు చేశారు.
ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందువల్ల రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని ఇప్పుడు ఈ మూడు పార్టీలు ప్రశ్నించలేవన్నారు. అందరి ఆశలు, ఆకాంక్షలను ఈ నూతన సంవత్సరం నెరవేరుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా రూపకల్పనలో అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు.
ఓట్ల తొలగింపు విషయంలో మరింత పారదర్శకత అవసరమన్నారు. వాలంటీర్లు, గ్రామ-వార్డు సచివాలయాల సిబ్బందిని ఉపయోగించుకుని ఓటర్ల జాబితాలో జగన్ సర్కార్ అవకతవకలకు పాల్పడుతోందన్నారు. ఓట్ల జాబితాలో అవకతవకలంటూ వస్తోన్న ఫిర్యాదులపై ఈసీ విచారణ చేపడుతుందా? అని నిలదీశారు. కేంద్ర ఎన్నికల సంఘం మౌనం ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. కొత్త ఏడాదిలోనైనా సీఈసీ తన మాట నిలబెట్టుకుంటుందా?’ అని ప్రశ్నించారు.