రెండు తెలుగు రాష్ట్రాలలో పాగా వేయాలని ప్రయత్నిస్తోన్న బీజేపీ (BJP)కి కాలం కలిసి రావడం లేదని అనుకొంటున్నారు. తెలంగాణ (Telangana)లో ఎన్నికలకి ముందు ఫుల్ జోష్ లో ఉన్న కాషాయం.. ఎన్నికలు సమీపించే సరికి చతికిల పడిందనే అపవాదు మూటగట్టుకోంది. కనీసం ఏపీలో అయినా ఖాతా తెరవాలని చేస్తోన్న, ప్రయత్నాలు అనుకొన్నంతగా ఫలించడం లేదని తెలుస్తోంది. అసలే బీజేపీకి ఏపీలో ఉన్న క్యాడర్ అంతంత మాత్రమే.. ఈ పరిస్థితుల్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. విజయనగరం (Vizianagaram) పార్లమెంట్ కన్వీనర్ (Parliament convener ) గద్దె బాబూరావు (Gadde Baburao) ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా బీజేపీలో ప్రవర్తించానని, ఏ తప్పు చేయకుండా ఇప్పుడు బయటకు వస్తున్నట్లు తెలిపారు. బీజేపీలో చేరిన మూడేళ్లలో పార్టీ నిర్ణయాలకి కట్టుబడి అన్ని కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఏపీలో బీజేపీ దూకుడుగా వ్యవహరించాలని.. కానీ చలనం లేనట్టు ఉండటంతో.. రాబోయే ఎన్నికల్లో కాషాయం ఏపీలో పెద్దగా ప్రభావం చూపించే అవకాశాలు లేనట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు బీజేపీకి రాజీనామా చేసిన గద్దె బాబూరావు.. రాష్ట్రంలో కమలం బలాన్ని.. బలహీనతలని చెప్పి చెప్పకనే వెల్లడించినట్టు తెలుస్తోంది. నా పోరాట పటిమా బీజేపీలో చాలామందికి నచ్చడం లేదు అనే విషయం అర్ధం అవుతోందని.. ఈ జిల్లాలో బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి అని బీజేపీ అధిష్టానాన్ని అడిగినట్టు బాబూరావు తెలపడం వెనక ఏదో మర్మం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బీజేపీ ఏపీలో ఉన్నట్టా? లేనట్టా? అనే అనుమానాలు రాష్ట్ర నేతల్లో మొదలైనట్టు టాక్..