టీమిండియా(Team India) స్టార్ క్రికెటర్లు తిరుమల(Tirumala)లో మెరిశారు. క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ టైంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వారికి అర్చకులు ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కొన్ని రోజుల క్రితం ఘోర కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ ఇటీవలే కోలుకొని స్వామి వారి దర్శనం కోసం వచ్చారు. ఆలయం వెలుపలికి వచ్చిన రిషభ్ పంత్, అక్షర్ పటేల్‌తో ఫొటోలు దిగడానికి పోటీపడ్డారు. టీటీడీ సిబ్బంది సైతం ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపారు. వారిని ఏ మాత్రం నిరాశపర్చలేదు క్రికెటర్లు. వారితో ఓపిగ్గా ఫొటోలు దిగారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందంటూ వారు చెప్పుకొచ్చారు. భారత్ వరల్డ్ కప్ గెలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 59,335 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 23,271 మంది తలనీలాలను సమర్పించారు. 23 కంపార్ట్మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం కింద స్వామివారి దర్శించుకోవాలనుకునే వారికి ఎనిమిది నుంచి 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది.
హుండీ ద్వారా 3.29 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది. కార్తీకమాసారంభం అనంతరం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లుచేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది.