ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) చంద్రబాబు(Chandrababu)కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై హాట్ కామెంట్లు(Hot Comments) చేశారు. తాడేపల్లిలో మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌పై స్పందించాల్సిన అంశమే కాదన్నారు సజ్జల.
‘ఇది కేవలం ఆరోగ్య కారణాలపై ఇచ్చిన మధ్యంతర బెయిల్.. చెప్పుకోవటానికి కూడా న్యూసెన్స్‌గా ఉండే చర్మ వ్యాధులు చంద్రబాబుకు ఉన్నాయి.. ఇక, చంద్రబాబుకు ఉన్న చర్మ వ్యాధులను ప్రాణాంతకం అన్నట్లు చూపించే ప్రయత్నం చేశారు.. మధ్యంతర బెయిల్ వచ్చిందని సంబురాలు చేసుకునే వారికి సిగ్గుందా..? కేసు మెరిట్ చర్చ జరిగిందా..?’ అంటూ సజ్జల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు కంటి శస్త్ర చికిత్స కు సంబంధించిన అంశానికి మాత్రమే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కానీ, ఎక్కడ గెలిచింది నిజం? స్కిల్ స్కాం జరుగలేదా? పెండ్యాల శ్రీనివాస్ పారిపోవటం వెనుక పాత్ర ఎవరిది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. వ్యవస్థలను మేనేజ్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు బయటకు ఎలా వస్తాడు? అని నిలదీశారు. ఇప్పుడు మధ్యంతర బెయిల్ రావటమే మాకు వ్యవస్థలను మేనేజ్ చేసే అలవాటు లేదు అనటానికి ఉదాహరణగా చెప్పారు. కాగా, సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు రిలీజ్ కానున్నారు.. అక్కడి నుంచి విజయవాడకు ఆయన రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. ఇప్పటికే చంద్రబాబు కాన్వాయ్ రాజమండ్రికి బయల్దేరి వెళ్లింది.