రాష్ట్రంలో పలు సంచనాలకు తెరతీసిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tappin Case) కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారిస్తుండగా..అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు కూడా ఈ కేసును హ్యాండిల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు అయిన భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులు అడ్డగోలుగా అక్రమాస్తులు ఆర్జించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో నిర్దారణకు వచ్చింది.
గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వీరిని అడ్డుకునేవారే లేకపోయారని విచారణ బృందం పేర్కొంది. ఓ మంత్రి అండదండలు చూసుకుని వ్యాపారులు, రియల్ ఎస్టేట్, జ్యువెల్లరీ ఓనర్స్, సినిమా రంగంలోని పలువురు పెద్దలు, పొలిటికల్ లీడర్స్ ఇలా పెద్ద పెద్ద వారి నంబర్లను ట్యాప్ చేసి వారిని బెదిరించి డబ్బులు గుంజినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ప్రణీత్ రావు హవాలా వ్యాపారులు, నగల వ్యాపారులను బెదిరించి కోట్లు కొల్లగొట్టారని సమాచారం.ఈ క్రమంలోనే వీరిని విచారించేందుకే ఏసీబీ కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఎవరెవరి వద్ద ఎంత మొత్తంలో డబ్బులు దండుకున్నారనే విషయంపై ఏసీబీ ప్రధానంగా ఫోకస్ చేయనున్నది.
వీరే స్వయంగా వ్యాపారులను బెదిరించి డబ్బులు లాగారా? ఎవరైనా ఈ అధికారులకు ఆదేశాలు ఇచ్చి డబ్బులు గుంజాలని చెప్పారా? అనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పలు కంపెనీల యాజమానులను బెదిరించి వారితో బలవంతంగా గత బీఆర్ఎస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్లు కొనిపించారని కూడా విచారణలో తేలినట్లు విచారణ అధికారులు వెల్లడించారు.