ఈ కలికాలంలో పుణ్యాల మాట కనుమరుగైంది. వాటికి మంగళం పలికిన మనుషులు పాపాలను మాత్రం అదే పనిగా చేసుకొంటూ పోవడం కనిపిస్తోంది. ఎక్కడ చూడు అవినీతి జాడలు నీడలుగా వెంటే ఉండటం కనిపిస్తోంది. అడుగడుగునా దగా కోరులు దర్జాగా చీకటి దందాలు చేస్తుండటం కనిపిస్తోంది. ఇలా అవినీతి తిమింగలాలు కోట్లకు కోట్లు మింగుతుంటే మరోవైపు సామాన్యుల రక్తం తాగుతోన్న జలగల బాగోతం తాజాగా తెరపైకి వచ్చింది.
హైదరాబాద్ (Hyderabad)లో డ్రగ్ కంట్రోల్ అధికారులు చేసిన దాడుల్లో బ్లడ్ బ్యాంక్‌ల్లో ఫ్లాస్మా మాఫియా నిర్వాకం బయటపడింది. ప్రాణాలను కాపాడే పవిత్ర వృత్తికి కళంకం తెస్తూ, డబ్బు కోసం గడ్డి తింటున్నారు కొందరు కేటుగాళ్లు. బ్లడ్ బ్యాంక్ (Blood bank)ల ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్మా (Plasma)ను సేకరించి.. అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్న వైనం కలకలం రేపింది.
మూసాపేట (Musapeta)లోని ఓ అపార్ట్మెంట్లో రక్త పిశాచాలు గత కొన్ని రోజులుగా ఈ దందా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమంగా బ్లడ్ ప్లాస్మాను నిల్వ ఉంచిన నిందితులు.. హోమియో సర్వీస్ ల్యాబ్ పేరిట వ్యాపారం చేస్తున్నట్లు తెలుసుకొన్నారు. ఈ వ్యవహారం ఎనిమిదేళ్లుగా నడుస్తున్నట్లు గుర్తించారు. 150 ఎంఎల్ ప్లాస్మాను రూ.150 కి సేకరించి.. రూ.3,800 రాఘవేంద్ర నాయక్ అనే వ్యక్తి విక్రయిస్తున్నాడని తెలిపారు.
మరోవైపు ఈ చీకటి దందాపై పక్కా నిఘా పెట్టిన డ్రగ్ కంట్రోల్ అధికారులు పలు బ్లడ్ బ్యాంక్‌ల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భారీగా ప్లాస్మా యూనిట్లను స్వాధీనం చేసుకొన్నారు. సికిర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్.ఆర్ బ్లడ్ బ్యాంక్ సహా క్లిమెన్స్, క్లినోవి రీసెర్చ్, నవరీచ్ క్లినిక్, జీ7 ఎనర్జీ, క్యూపీఎస్ బయోసర్వీస్, శిల్ప మెడికల్, జెనీరైస్ క్లినిక్, వింప్టా ల్యాబ్‌లపై దాడులు నిర్వహించారు.. ఈ రాకెట్ కు సంబంధించిన వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేశారు.