నల్గొండ (Nalgonda) జిల్లా, మిర్యాలగూడ (Miryalguda) వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ఇంటికి చేరుకునేలోపే మృత్యువు లారీ రూపంలో కబలించింది. రెండు కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఈ ప్రమాదంలో కారు నుజ్జనుజ్జయింది.
మరణించిన వారిలో మిర్యాలగూడ, నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేష్ (32), అతని భార్య జ్యోతి (30), కుమార్తె రిషిత (6), యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లికి చెందిన భూమా మహేందర్ (32), అతని కుమారుడు లియాన్సి (2) ఉన్నారు. కాగా మహేందర్ భార్య భూమా మాధవికి తీవ్ర గాయాలయ్యాయి. మిర్యాలగూడలో ప్రాథమిక చికిత్స అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
మృతుడు మహేష్ హైదరాబాద్ (Hyderabad) వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడని సమాచారం. కుటుంబ సభ్యులతో బెజవాడ దుర్గమ్మను దర్శించుకోని వస్తుండగా.. ప్రధాన రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా కారును ఢీ కొట్టిన లారీని గుర్తించారు.
టోల్ గేట్ లో ఉన్న సిసి ఫుటేజ్ ఆధారంగా అద్దంకి వద్ద లారీని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నార్కట్‌పల్లికి చెందిన పొట్టు లారీగా గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గంటల్లోనే నిందితున్ని పట్టుకొన్నారు. మరోవైపు రెండు కుటుంబాలకు చెందిన బంధువులు రోదనలతో మిర్యాలగూడెం ప్రభత్వఆసుపత్రి వద్ద విషాదఛాయలు అలుముకొన్నాయి.