Featured posts
– విపక్షంలో ఉన్నప్పుడు వినయం
– మంత్రులు అయ్యాక అధికార దర్పం
– హైకమాండ్ నే లైట్ తీసుకుంటున్న నేతలు
– పార్టీకి అండగా ఉన్నవాళ్లను దూరం పెడుతూ రాజకీయాలు
– బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన వారితో చెట్టాపట్టాల్
– కాంగ్రెస్ నే తొక్కేయడానికి ఫండింగ్ చేసిన వ్యాపారులతో స్నేహాలు
– లగ్జరీ కార్లలో చక్కర్లు.. అన్నీ గమనిస్తున్న ప్రజలు
తెలంగాణ (Telangana) లో పదేళ్ల కేసీఆర్ (KCR) పాలనను కాదని ప్రజలు కాంగ్రెస్ (Congress) కు పట్టం కట్టారు. సీఎంగా రేవంత్ (CM Revanth).. కొందరు సీనియర్లు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే.. తమ ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటాలు ఉండవు.. అనసవర ఖర్చులు పెట్టం.. ఆచితూచి ప్రజా పాలన అందిస్తామని మొదట్నుంచి హస్తం నేతలు చెబుతున్నారు. దీనికి తగినట్టే పైకి పలు కార్యక్రమాలు చేపట్టారు. కానీ, ఇదంతా పైపైన కవరింగే అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు మంత్రుల (Ministers) తీరు సరిగ్గా లేదనే చర్చ జోరందుకుంది.
అన్నీ గమనిస్తున్న ప్రజలు
ఈమధ్యే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరును రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ప్రజా పాలన, ప్రజా వాణి అంటూ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రభుత్వానికి ప్లస్ అవుతున్నాయని అనుకుంటున్నారు. కానీ, కొందరు మంత్రుల వ్యవహార శైలి సరిగ్గా లేదనేది మెజార్టీ ప్రజల వాదన. పార్టీ హైకమాండ్ కూడా వారిపై అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవక ముందే కొందరు నేతల్లో ఏదో తెలియని అధికార మత్తు ఆవహించినట్టు కనిపిస్తోందని అనుకుంటున్నారు.
అచ్చం కేసీఆర్ దారిలోనే..!
పదేళ్ల పాలనలో కేసీఆర్ అన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. పోలీసుల ద్వారా దాడులు చేసి ఎదురు తిరిగిన వారిని జైల్లో పెట్టి అణగదొక్కారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడికక్కడ మాట్లాడనీయకుండా కట్టడి చేసి రాష్ట్రాన్ని, రాజకీయాలను, మీడియాను తన గుప్పిట్లో పెట్టుకున్నారనే అపవాదును మూటగట్టుకున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడే గడ్డు సమయంలో అన్ని రంగాల వారు కాంగ్రెస్ కి అండగా నిలిచారు. అదే సమయంలో బీజేపీ దూకుడు ప్రదర్శించడంతో ఒకరిద్దరు మినహా మిగిలిన హస్తం నేతలు ఎవరూ కేసీఆర్ కి ఎదురొడ్డి నిలబడి మాట్లాడే ధైర్యం చేయలేదు. కొందరైతే సైలెంట్ గా స్నేహ హస్తం అందించారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా అదే దారిలో నడుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
అప్పుడు వినయం.. ఇప్పుడు అధికార దర్పం
అధికారంలోకి రాక ముందు అందరినీ కలిసి ఎంతో వినయంగా మాట్లాడిన నేతలు.. ఇప్పుడు మంత్రులు కాగానే హైకమాండ్ నే లైట్ తీసుకుంటున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. అంతేకాదు, మొదట్నుంచి పార్టీకి అండగా ఉన్నవాళ్లను సైతం దూరం పెడుతున్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఇంకోవైపు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన వారితో చెట్టాపట్టాలేసుకుని ముందుకెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ ని అణచివేసి బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్న వ్యాపారస్తులతో కొందరు మంత్రులు.. స్నేహ రాగాలు పాడుతూ.. లగ్జరీ కార్లలో చక్కర్లు కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే, బీఆర్ఎస్ సానుభూతి పరులు, ఓఎస్డీలు, పర్సనల్ సెక్రెటరీలతో సహా చుట్టూ అందరూ బీఆర్ఎస్ వాళ్లే ఉండడం చూస్తుంటే.. తెర వెనుక ఏదో జరుగుతోందని అటు పార్టీలో, ఇటు ప్రజల్లో చర్చ జోరందుకుంది.