Featured posts
ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో బట్టకాల్చి అవతలి వారి మీద వేసిన తీరుగా ప్రభుత్వం గవర్నర్ పై వేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన ఆయన.. గవర్నర్ కు ఒక్క రోజు ముందే బిల్లు పంపారని అన్నారు. ఆ బిల్లు చూడాలి, చదవాలి, సంతకం చేయాలని చెప్పారు. గవర్నర్ హైదరాబాద్ లో అందుబాటులో లేరని చెబుతున్నా.. ప్రభుత్వం హడావుడి చేస్తోందని ఫైరయ్యారు.
గెస్ట్ లెక్చరర్స్, సెకండ్ ఏఎన్ఎంలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మహిళా సంఘాలు అనేక మంది తమ సమస్యలు చెప్పుకుందామంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఈటల. మంత్రులు, అధికారులు భరోసా ఇవ్వడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఎవరికి అందుబాటులో ఉండరని.. సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ నిర్వహించాలని చెప్పారు. ఏదో మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
ఉన్న కొద్ది రోజుల్లో ఒకరోజు హరీష్ రావు, ఒకరోజు కేటీఆర్ మాటల దాడితోనే సరిపోయిందని.. తర్వాత కేసీఆర్ వంతు అంటూ ఎద్దేవ చేశారు రాజేందర్. ఆర్టీసీలో సంస్థకు సంబంధించి 6 వేల బస్సులు మాత్రమే నడుస్తున్నాయన్న ఆయన.. ప్రభుత్వంలో విలీనాన్ని స్వాగతిస్తున్నామని.. కాకపోతే కార్మికులకు రెండు పీఆర్సీలు బకాయిలు పడ్డారని.. అవి ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీలో పనిచేసే ఇతర సిబ్బందిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికులను బలవంతంగా గవర్నర్ కార్యాలయం ముందు ధర్నాకు తీసుకువస్తున్నారని మండిపడ్డారు ఈటల. కార్మికులు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని.. వచ్చే తమ ప్రభుత్వంలో వారి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.