ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కాంగ్రెస్ పార్టీ(Congress Party)పై తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్ర అనుమానితుల పట్ల ఆ పార్టీ మెతక వైఖరి అనుసరించిందని ఆరోపించారు. ఒకవైపు పేదలు ఆకలితో అలమటిస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టి మేపిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజస్థాన్‌లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి విధానాలు గానీ.. కీలక నిర్ణయాలు గానీ లేవని విమర్శించారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు కొదవలేదని చెప్పుకొచ్చారు. నాలుగు సంవత్సరాలుగా ప్రధాని మోడీ ప్రభుత్వం ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు.
పథకాలను 80కోట్ల మంది పౌరులకు ఉచిత రేషన్ అందిస్తోందని గుర్తుచేశారు. దేశంలో ఏదైనా అతిపెద్ద సమస్య ఉందంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అని దుయ్యబట్టారు. మోడీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారత దేశ ప్రతిష్ట పెరిగిందన్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదం ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌పై కాంగ్రెస్ రుద్దిన ఆర్టికల్ 370ని శాశ్వతంగా రద్దు చేశామని వెల్లడించారు.
అదేవిధంగా అయోధ్య రామమందిర నిర్మించిన ఘటన భారతీయ జనతాపార్టీకే దక్కుతుందన్నారు. అది ప్రధాని మోడీ కృషివల్లే సాధ్యమైందన్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని చూసి కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలు కనిపించకుండా పోయారని ఒక్క మోడీ మాత్రం ప్రజల్లో ధైర్యాన్ని నింపారని అన్నారు. తన గురించి తాను పట్టించుకోకుండా దేశ ప్రజల కోసం అవిశ్రాంతంగా శ్రమించి ఉచితంగా వ్యాక్సిన్లు ఇప్పించారని కొనియాడారు.