కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై అసోం(ASSAM) సీఎం హిమంత బిస్వశర్మ(CM HIMANTHA BISWASHARMA) విమర్శలు గుప్పించారు. ఈ మేనిఫెస్టో భారత్లో కంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ ఎన్నికలకు చాలా బాగా పనికొస్తుందని ఎద్దేవా చేశారు. ఈ మేనిఫెస్టో సమాజాన్ని విభజించే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. జోర్హాట్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో బిస్వశర్మ ప్రసగించారు.
‘కాంగ్రెస్ మేనిఫెస్టో ఎప్పటిలాగే బుజ్జగింపు రాజకీయాలను తలపిస్తోంది. దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది భారత్లో జరిగే ఎన్నికల కోసం కాకుండా పాకిస్తాన్ జరిగే ఎన్నికల కోసం ఉద్దేశించినదిగా అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.దేశంలో హిందువులు లేదా ముస్లింలు ఎవరూ ట్రిపుల్ తలాక్ పునరుద్ధరుణను కోరుకోవడం లేదన్నారు.
బాల్యవివాహాలు, బహుభార్యత్వాన్ని కూడా ఎవరూ సమర్థించడం లేదన్నారు.సమాజాన్ని విభజించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. అసోం 14 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురువుగా మార్చేందుకు బీజేపీ కంకణం కట్టుకున్నదన్నారు.
బిస్వశర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. ఆయన లాంటి పార్టీ మారిన వ్యక్తులకు లౌకిక, సమ్మిళిత తత్వాన్ని అర్థం చేసుకోలేరని అసోం కాంగ్రెస్ అధికార ప్రతినిధి బేదబత్ర బోరా తెలిపారు. అన్నివర్గాల ప్రయోజనాలను కాపాడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు.