భారత భూభాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)పై డ్రాగన్ కంట్రీ చైనా(China) మరోసారి విషం చిమ్మింది. అరుణాచల్ తమ దేశ భూభాగమని మొండి వాదన చేస్తోంది. వరుస వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నా భారత్ మాత్రం హాస్యాస్పదమని కొట్టిపారేస్తూ వస్తోంది. అయినప్పటికీ చైనా తీరు మారడంలేదు.
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో నిర్మించిన సేల సొరంగాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని మోడీని చూసి చైనా ఉలిక్కిపడినట్లుంది. ఇదివరకు జరిగిన సభల్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్(Jai Shankar) దీటుగా సమాధానం ఇచ్చిన నేపథ్యంలో చైనా మరోసారి స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ అన్యాయంగా ఆక్రమించుకుందంటూ చైనా కుంపటి రగిలించింది.
చైనా ఈ వ్యాఖ్యలు చేయడం ఈ నెలలో నాలుగోసారి. ఈ అంశం పై భారత్ కూడా గట్టిగానే బదిలిస్తోంది. తాజాగా జరిగిన యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కాన్ఫరెన్స్లో ప్రసంగించిన సమయంలో పలువురు అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ మంత్రి చైనా వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఈ వివాదం కొత్త కాదంటూ చైనా మాటలను తోసిపుచ్చింది.
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం ఇప్పటిదేం కాదు. అరుణాచల్ భూభాగంపై చైనా 1987లోనే కన్నేసింది. అప్పుడే ఆక్రమించుకున్నామని, అంతకుముందు చైనా పరిపాలన కొనసాగిందంటూ చైనా విదేశాంగ అధికారి లిన్ జియన్ తెలిపారు. ఈ విషయంలో చైనా వైఖరి మారదంటూ మొండి వాదనకు దిగారు.