మద్యం పాలసీలో (Liquer policy) జరిగిన మనీ లాండరింగ్ (money landaring case) కేసు విషయమై విచారణకు రమ్మంటే కేజ్రీవాల్ (cm kejiriwal)కుంటిసాకులు చెబుతున్నారని ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే, ఈడీ పదేపదే సమన్లు పంపుతుండటంపై ఢిల్లీ సీఎం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈడీకి పలు ప్రశ్నలను సంధించింది.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ ఈడీ అరెస్టు నుంచి ఢిల్లీ సీఎంకు ఉపశమనం కల్పించాలని పిటిషన్లో కోరారు. అనంతరం ఈడీ స్పందిస్తూ .. మద్యం పాలసీ కేసులో విచారణను తప్పించుకోవడానికి కేజ్రీవాల్ కుంటిసాకులు చెబుతూ పదేపదే తప్పించుకుంటున్నారని ఆరోపించింది.
అంతేకాకుండా కేజ్రీవాల్ వేసిన పిటిషన్ అర్హమైనది కాదని ఈడీ పేర్కొంది. దీనికి రిప్లై ఇస్తామని తెలిపింది. దీనిపై ఇంకా ఏమైనా సమన్లు ఉన్నాయా? అని కోర్టు ప్రశ్నించగా..ఈడీ స్పందిస్తూ గురువారానికి (21వ తేదీ)కి సమన్లు పంపించామని తెలిపింది.
మధ్యలో కేజ్రీవాల్ తరఫు లాయర్ కలుగజేసుకుని విచారణ పేరుతో పిలిచి సీఎంను అరెస్టు చేయాలని ఈడీ భావిస్తోందని, అందుకే ఆయనకు అరెస్టు నుంచి ఉపశమనం కలిగించేలా తీర్పు ఇవ్వాలని హైకోర్టులో వాదించారు. తొలిసారి నోటీసులు ఎప్పుడు జారీ చేశారని హైకోర్టు ప్రశ్నించగా..2023 నవంబర్ 2న జారీచేసినట్లు ఈడీ వివరించింది. ఇప్పటివరకు 9 సార్లు సమన్లు జారీ చేశామని, ఇప్పుడు ఎన్నికలను అడ్డుగా పెట్టుకుని విచారణకు గైర్హజరు అయ్యేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఈడీ తరఫు లాయర్ బలమైన వాదనలు వినిపించారు. కాగా, ఈ కేసులో వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి.